పవర్ బాగానే తలకెక్కిందిగా? పాదయాత్రను జిల్లాలోకి రానివ్వరట

Update: 2022-10-08 05:20 GMT
రాజకీయం ఒకప్పటిలా అస్సలు లేదు. పాత పోయి కొత్త వచ్చినప్పుడు కొంత మార్పు ఉంటుంది. కానీ.. కొత్త పాత కలయికలో ఉన్నప్పుడు అంతలా మార్పులు చోటు చేసుకోవు. కానీ.. ఈ వాదనకు భిన్నంగా ఉంది ఏపీ రాజకీయం. యువకుడైన ముఖ్యమంత్రి జగన్ ఏలుబడిలో.. రాజకీయాల్లో సీనియర్లుగా వ్యవహరిస్తున్న వారు సైతం తమ వ్యాఖ్యలతో సంచలనాలకు తెర తీస్తున్నారు. తాము ఏ పాదయాత్రతో అయితే అధికారంలోకి వచ్చామో.. ఇప్పుడు అలాంటి పాదయాత్రనే మరికొందరు చేస్తున్న వైనాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడటం లేదు ఏపీ మాజీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ తో మొదలు పెట్టిన పాదయాత్రపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. అమరావతే రాజధానిగా పేర్కొంటూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఇలాంటి వేళ.. పాదయాత్రపై సీరియస్ కామెంట్లు చేశారు.

విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా చేయటానికైనా వెనుకాడేదే లేదన్న ఆయన.. చంద్రబాబు ఆయన అనుచరులు విశాఖను ఏపీ రాజధానిగా వద్దంటున్న మాటలకు గట్టి సమాధానం ఇస్తామన్నారు.

ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ మెంట్ అంటూ ఉత్తరాంధ్రుల శ్రమను దోచి పెట్టారని.. తన ఆస్తుల్ని పెంచుకోవటం కోసం చంద్రబాబు ఇప్పుడు అమరావతినే రాజదానిగా పేర్కొంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ చేస్తున్న పాదయాత్రను శ్రీకాకుళంలో అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ధర్మాన చేసిన తాజా వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది.

ప్రజాస్వామ్య భారతంలో తమ నిరసనను.. ఆందోళనను చెప్పటానికి పలు వేదికలు ఉన్నాయి. అందుకు భిన్నంగా రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటామని చేస్తున్న ధర్మాన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరైనా తమ వాదననను వినిపించాలంటే.. అందుకు తగ్గ వాతావరణం ఉండాలే తప్పించి.. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించకూడదన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు ధర్మాన క్రిష్ణదాస్ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుంటామని.. శ్రీకాకుళంలోకి అడుగు పెట్టనివ్వమని అంటున్నారు. ఒకప్పుడు మంత్రిగా వ్యవహరించిన ఆయన..  ప్రజాస్వామ్యపద్దతిలో సాగుతున్న పాదయాత్రను అడ్డుకుంటామన్న మాటలు దేనికి నిదర్శనం? మంత్రి పదవి నుంచి తప్పించినా.. ఆయన తలకు ఎక్కిన పవర్ మాత్రం ఇంకా దిగలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News