ఓటు గల్లంతు.. ఏపీ మంత్రి చెప్పింది అబద్ధమా?

Update: 2019-03-09 05:01 GMT
ఓట్ల గల్లంతు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరణ తీరు అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఓట్ల గల్లంతు విషయంలో తెలుగుదేశం పార్టీ మొదట్లో స్పందించనే లేదు. ఈ విషయం మీద వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఈసీని కలిసి ఫిర్యాదు చేసినప్పుడు కూడా టీడీపీ మారు మాట్లాడలేదు. అది తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా తెలుగుదేశం కామ్ గా ఉండిపోయింది.

కొన్ని నెలల నుంచి ఈ అంశం గురించి మాట్లాడని తెలుగుదేశం పార్టీ.. తీరా ఐటీ గ్రిడ్స్ దొరికిపోయాకా మాత్రం ఆందోళన మొదలుపెట్టింది. తమ పార్టీ అనుకూలుర ఓట్లు గల్లంతు అయ్యాయని తెలుగుదేశం పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ  విషయంలో అప్పటికిప్పుడు తెలుగుదేశం నేతలు వెళ్లి ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఒకటి కాదు.. తెలుగుదేశం నేతలంతా తలా ఒక ఫిర్యాదు చేశారు.

మరి అంత వరకూ గుర్తుకు రాని ఓట్ల గల్లంతు అంశం.. అప్పుడు  ఎందుకు గుర్తుకు వచ్చింది? అనేది కామన్ డౌట్. అదలా ఉంటే.. తాజాగా తన ఓటు గల్లంతు అయ్యిందని ఏపీ మంత్రి ఫరూక్ ఒక ప్రకటన చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్ర చేశారని, తన ఓటుతో పాటు తన వారి ఏడు ఓట్లను తీసేయించారని ఫరూక్ ఆరోపించారు. ఒక మంత్రి ఇలా ప్రకటన చేయడం అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటని విచారిస్తే.. మంత్రిగారు అబద్ధం చెప్పారని తేలిపోయింది.

అందుకు ఆధారాలు కూడా  లభించాయి. నంద్యాల టౌన్లోని ముల్లాన్ పేటలోని 72 వ పోలింగ్ బూత్ లో మంత్రి ఫరూక్, ఆయన భార్య, ఇతర కుటుంబీకుల ఓట్లు ఉన్నాయని స్థానిక ఓటర్ లిస్ట్ ద్వారా స్పష్టం అవుతోంది. అయితే మంత్రి తన ఓటు పోయిందని, తన కుటుంబీకుల ఓట్లు పోయాయని చెప్పుకొచ్చారు.

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో మంత్రి కుటుంబీకులు ఓట్లను నమోదు చేయించుకున్నారని.. అవి అలాగే ఉన్నాయని తెలుస్తోంది. ఓటర్ లిస్టులో వారి పేర్లు, ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే.. కేవలం ఓట్ల గల్లంతు వ్యవహారం గురించి జనాల దృష్టిని మళ్లించడానికి.. తాము బాధితులం అని చెప్పుకోవడానికే మంత్రి ఇలాంటి ప్రకటన చేశారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!
Tags:    

Similar News