జేపీ న‌డ్డా కు మినిస్ట‌ర్ రోజా స‌వాల్ ! ఔ మ‌ల్ల !

Update: 2022-06-09 02:30 GMT
దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్క‌డ‌యినా ఏపీలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టి అమ‌లు చేసే ద‌మ్ముందా అంటూ జేపీ న‌డ్డాకు మంత్రి రోజా ఓపెన్ స‌వాల్ విసిరారు. ఆత్మ‌కూరు సాక్షిగా పోటీచేసి ఎవ‌రేంటి ఎవ‌రి స‌త్తా ఏంటి అన్న‌ది తేల్చుకోవాల‌ని మ‌రో స‌వాల్ కూడా విసిరారు. దేశంలో ఒక్క ఏపీలోనే ఎన్నో మంచి ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయని, వీటిని ఇత‌ర రాష్ట్రాల‌లో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలో అమల చేయ‌డ‌మే కాదు దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని స‌వాల్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో రోజా మాట్లాడారు. నిధుల విడుద‌ల్లో కేంద్రం సాయం లేక‌పోయినా స‌రే ! తాము ప‌థ‌కాల అమ‌లును స‌జావుగా సాగిస్తున్నామ‌ని, అప్పులు ఒక్క ఏపీ మాత్ర‌మే చేయ‌లేద‌ని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ చేస్తున్నాయ‌ని అన్నారు. దీంతో ఇప్పుడీ మాట‌లు తెగ ట్రోల్ అవుతున్నాయి.

రోజా వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బీజేపీలోనూ గంద‌ర‌గోళం నెల‌కొని ఉంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఇవ్వాల్సిన‌వేవీ ఇవ్వకుండా బీజేపీ బాస్ న‌డ్డా త‌మ‌ను బ్లేమ్ చేయ‌డం బాలేద‌ని రోజా అంటున్నారు. ఇది కూడా ఏపీ బీజేపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎందుకంటే ఇప్ప‌టిదాకా ఈ ప్రాంతం స‌మ‌స్య‌ల‌పై ఏపీ బీజేపీ విభాగం మాట్లాడిన దాఖ‌లాలు లేవు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా మ‌నకు ద‌క్కించిందేమీ లేదు.అందుకే వైసీపీ త‌న మాట‌ల దాడిని కొన‌సాగిస్తూ ఉంది.

ఆరోగ్య శ్రీ పథ‌కం కింద ఏపీ దాదాపు 2500 కోట్లు వెచ్చిస్తోంద‌ని కానీ కేంద్రం ఆయుష్మాన్ భార‌త్ కింద ఇచ్చేది కేవ‌లం 230 కోట్లేన‌ని చెబుతూ, అబ‌ద్ధాల‌ను బీజేపీ  ఏ విధంగా ప్రచారం చేస్తుంద‌ని రోజా ప్ర‌శ్నిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ప‌థ‌కం అన్న‌ది ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్సార్ సాహ‌సోపేత నిర్ణ‌యం కార‌ణంగానే అమ‌లుకు నోచుకుంద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నిండు సభ‌లో చెప్పార‌ని ప్ర‌స్తావించారు.ఇవేవీ ప‌ట్టించుకోకుండా, చంద్రబాబు, ప‌వ‌న్ ఇచ్చిన స్క్రిప్ట్ చ‌దివితే ఇలానే ఉంటుంద‌ని మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో  నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉంటే త‌మ పోరుకు ఏపీ బీజేపీ కూడా క‌లిసి రావాల‌న్న వాదన కూడా వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ వినిపిస్తోంది. ఇవ‌న్నీ ఇప్పుడు బీజేపీని ఇర‌కాటంలో ప‌డేశాయి. అంటే జేపీ న‌డ్డా చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలే అని రోజా తేల్చేయ‌డంతో బీజేపీ కౌంట‌ర్లు ఇచ్చేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చేందుకు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News