ఇదేంది ఫైర్ బ్రాండ్.. మంత్రి పదవి ఇచ్చేశారో లేదో హడావుడి మామూలుగా లేదుగా?

Update: 2022-05-03 14:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే.. తన పాలన సగ కాలం పూర్తి అయిన వెంటనే.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడతానని చెప్పటం.. అందుకు తగ్గట్లే ఆయన పలువురిని సాగనంపి.. ఆస్థానాల్లో కొత్త వారిని తీసుకురావటం తెలిసిందే. నిజానికి జగన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న మాట వినిపించినంతనే.. ఆయన మంత్రివర్గంలో కచ్ఛితంగా స్థానం లభిస్తుందన్న పేరున్న నేతల్లో ఆర్కే రోజా ఒకరు. అలాంటి ఆమెకు మంత్రి పదవి రావటానికి మూడేళ్లు పట్టింది.

తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె చేస్తున్న పర్యటనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జగన్ ప్రభుత్వంలోని మరే మంత్రి కూడా ఇంత భారీ ఎత్తున ప్రముఖుల వద్దకు వెళ్లటం మాత్రం కనిపించదు. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్ కు కుటుంబ సభ్యులతో సహా వెళ్లిన ఆమె.. అనంతరం మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా చిరు ఇంటికి వెళ్లిన ఆర్కే రోజాకు ఘన స్వాగతం పలికి.. శాలువాతో సత్కారం చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.

తాజాగా మంత్రి రోజా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లి దివంగత వైఎస్ సతీమణి విజయమ్మను కలవటం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొంతకాలంగా సీఎం జగన్ కు.. తల్లి విజయమ్మతో పాటు.. చెల్లెలు షర్మిలతోనూ సరైన సంబంధాలు లేవని.. వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వార్తలు రావటం తెలిసిందే. ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. జగన్ కేబినెట్ లో ఉన్న ఏ మంత్రి కూడా విజయమ్మను కలిసి ఆశీస్సులు పొందింది లేదు. అందుకు భిన్నంగా రోజా మాత్రం నేరుగా విజయమ్మ వద్దకు వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న విజయమ్మ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం తెలిసిందే. అలాంటిది మిగిలిన వారికి భిన్నంగా రోజా మాత్రంవిజయమ్మను కలవటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా మంత్రి పదవిని చేపట్టిన అనంతరం రోజా చేస్తున్న తెలంగాణ యాత్రకు సంబంధించి జగన్ నుంచి రియాక్షన్ తప్పక ఉంటుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News