ప్రముఖ గాయకుడికి ఏపీ మంత్రి దిమ్మతిరిగే కౌంటర్‌!

Update: 2023-01-12 02:56 GMT
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులోని 'నాటు నాటు పాట' ప్రపంచవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని అలరించింది. ఈ నేపథ్యంలో ఈ పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం లభించింది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. తెలుగు జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడే చేశారని అభినందించారు. జగన్‌ చేసిన ట్వీట్‌ పై ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు జెండా అని పేర్కొనడంపై అద్నాన్‌ సమీ జగన్‌ ను తప్పుబట్టారు. తనకు జాతీయ పతాకం మాత్రమే తెలుసని.. తెలుగు జెండా కూడా ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు జగన్‌ ట్వీట్‌ కు అద్నాన్‌ సమీ కౌంటర్‌ ఇచ్చారు.

ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి, ఆయనకు వీర విధేయుడైన గుడివాడ అమర్‌నాథ్‌.. అద్నాన్‌ సమీపై మండిపడ్డారు. అతడు సీఎం దేశభక్తిపై తీర్పు ఇచ్చేవాడు కాదన్నారు.

'మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు గురించి మేము గర్విస్తున్నాము. మేము తెలుగు. అద్నాన్‌ సమీ... మీరు మా దేశభక్తిపై తీర్పు చెప్పే వారు కాదు' అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఘాటుగా ట్వీట్‌ చేశారు.

అలాగే 'తెలుగువాడిని అనే నా గర్వం భారతీయుడిగా నా గుర్తింపును దూరం చేయదు' అన్నారాయన. ఈ విషయం అద్నాన్‌ సమీ తెలుసుకోవాలంటూ మంత్రి అమర్‌నాథ్‌ ట్విట్టర్‌ లో ఆయనకు చురకలు అంటించారు.

కాగా పాకిస్థాన్‌ కు చెందిన అద్నాన్‌ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. ముఖ్యమంత్రి జగన్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకోవడంతో తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని ట్వీట్‌ చేశారు.

'తెలుగు పతాకమా? మీ ఉద్దేశం భారత జెండా కాదా? ముందుగా మనం భారతీయులం. కాబట్టి దేశంలోని ఇతర ప్రాంతాల నుండి మిమ్మల్ని మీరు వేరుచేయడం మానేయండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనది ఒకే దేశం! ఈ 'వేర్పాటువాద' వైఖరి మనం 1947లో చూసినట్లుగా అత్యంత అనారోగ్యకరమైనది' అంటూ అద్నాన్‌ సమీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కాగా జగన్, అద్నాన్‌ సమీ ట్వీట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అద్నాన్‌ సమీని తప్పుపడుతూ సీఎం జగన్‌ కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొంతమంది జగన్‌ ను తప్పుబడుతూ అద్నాన్‌ సమీకి అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News