మేన‌మామ మెనూలోనూ కోత పెట్టారా?

Update: 2022-08-04 06:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల‌కు పెట్టే భోజ‌నంలోనూ కోత‌లు పెట్టార‌ని అంటున్నారు .  పిల్ల‌ల‌కు పెట్టే ఆహారంలోనూ కోత పెడుతున్నార‌ని తెలుగు మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విద్యార్థుల‌ను మేన‌మామ‌లా చూసుకుంటాన‌ని మాట ఇచ్చార‌ని.. ఇప్పుడు మాత్రం మేన‌మామ మెనూలోనే కోత పెడుతున్నార‌ని ఎద్దేవా చేస్తున్నాయి.

ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్.. పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అంద‌జేస్తున్నామ‌ని వారంలో ఏడు రోజులు ఏడు ర‌కాల మెనూ ఉండేట‌ట్లు పిల్ల‌ల‌కు రుచిక‌ర‌మైన‌, శుచిక‌ర‌మైన ఆహారం అందిస్తున్నామ‌ని చెప్పార‌ని గుర్తు చేస్తున్నాయి. అయితే అమ‌ల్లోకి వ‌చ్చేట‌ప్ప‌టికి మాత్రం పిల్ల‌ల‌కు నాణ్య‌మైన ఆహారం అంద‌డం లేద‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పిన మెనూ ఎక్క‌డ అమ‌లు కావ‌డం లేద‌ని అంటున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు/కళాశాలల్లో సుమారు 5 లక్షల మంది పిల్లలు ఉన్నార‌ని చెబుతున్నారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల డైట్‌ ఛార్జీలను ఒక్కొక్కరికి రూ.250 నుంచి రూ.500కు పెంచింద‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటినా ఇప్ప‌టికీ అవే డైట్ చార్జీలు ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. ఈ మూడేళ్ల కాలంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు దారుణంగా పెరిగాయ‌ని.. అయినా పాత డైట్ చార్జీలే చెల్లించ‌డం దారుణ‌మ‌ని చెబుతున్నారు.

2018 నాటి మెనూ ప్రకారం ప్రీమెట్రిక్‌ హాస్టళ్ల పిల్లలకు వారంలో ఆరు రోజులపాటు పాలు, గుడ్లు, మూడు రోజులు.. చికెన్‌, ఏడు రోజులు.. అరటిపండ్లు ఇవ్వాల్సి ఉంద‌ని అంటున్నారు. పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లలో రెండు రోజులు.. చికెన్‌ పెట్టాలి. మిగతాదంతా ప్రీమెట్రిక్‌ మెనూనే. నాలుగేళ్లనాటి ఈ డైట్‌ ఛార్జీలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ధరలన్నీ బాగా పెరిగాయని గుర్తు చేస్తున్నారు. అయిన‌ప్పటికీ డైట్ చార్జీల‌ను మాత్రం పెంచ‌లేద‌ని చెబుతున్నారు.

ప‌లు జిల్లాల్లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లలో నిర్దేశిత మెనూలో అధికారికంగానే కోత వేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చికెన్‌, కోడిగుడ్లు, అరటిపండ్లలో కోత విధించార‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహాల్లో ప్రభుత్వ మెనూ అమలును ఎప్పుడో మానేశార‌ని అంటున్నారు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లను వారంలో 3 రోజులకు... 6 రోజులు ఇవ్వాల్సిన పాలు, గుడ్లను 4 రోజులకు ఒక‌సారి పరిమితం చేశార‌ని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న కూరగాయలనే తెస్తున్నారంటున్నారు. ఇదేమని అడిగితే... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకేనని చెబుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని గురుకుల హాస్ట‌ళ్ల‌లో ఇదే దుస్థితి ఉంద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి సాంఘిక సంక్షేమశాఖ అధికారులు గ‌తేడాదే డైట్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలతో దస్త్రం సిద్ధం చేశార‌ని చెబుతున్నారు. 2021 నవంబరుకే ధరలను 25% పెంచాలని ప్రభుత్వానికి నివేదించినట్లు స‌మాచారం. అయితే ఆ దస్త్రం ప్రతిపాదన దశలోనే ఆగింద‌ని అంటున్నారు. ఇప్పటి నిత్యావ‌స‌ర‌ ధరలతో పోలిస్తే దీన్ని మరింత పెంచాల్సి రావొచ్చ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News