మనసులో మాట... మార్గాని చెప్పేశారా... ?

Update: 2021-12-26 16:31 GMT
టాలీవుడ్ కి ఏపీకి సంబంధం ఏంటి అంటే కేవలం సినిమా తెర బంధమే. టాలీవుడ్ లాండ్ అయింది, లొకేట్ అయింది పూర్తిగా హైదరాబాద్ లో. మేము టాక్సులు కడుతున్నామని గొప్పగా చెబుతున్న హీరోలు అంతా కట్టేది కూడా ఆ రాష్ట్రానికే. మరి ఏపీకి టాలీవుడ్ వల్ల లాభమేంటి అంటే ఏమీ లేదు అన్నదే జవాబు.

అదే టైమ్ లో టాలీవుడ్ కి ఏపీతో లాభం ఉందా అంటే చాలానే ఉంది. థియేటర్లు ఎక్కువ ఉన్నవే ఏపీలో. ఆదాయం వచ్చేది కూడా ఇక్కడ నుంచే. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు ఈ గొడవలు లేవు, ఇక చంద్రబాబు సీఎం అయిన తరువాత అయిదేళ్ళూ ఈ వివాదాలు లేవు. కానీ ఇపుడు మాత్రం ఒక ప్రశ్న సూటిగా వస్తోంది.

టాలీవుడ్ తో మాకు ఉపయోగమేంటి అని. అందుకే టాలీవుడ్ విషయంలో టార్గెట్ చేశారా అంటే జవాబు లేదు కానీ ఏపీ నుంచి తమ సినిమాల ద్వారా భారీ ఎత్తున రెవిన్యూ పొందుతున్న సినీ పెద్దలు ఈ ప్రాంతం వైపు తొంగి చూడడంలేదు, వంగి వాలడంలేదు అన్న బాధ అయితే చాలానే ఉంది అంటున్నారు.

ఏపీలోనే మూలాలు మొత్తం ఉన్న టాలీవుడ్ పెద్దలు అక్కడ సర్కార్ తో సన్నిహితంగా ఉంటూ ఏపీని కనీసం పట్టించుకోవడం లేదు అన్నదీ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు టికెట్ల రేట్లు తగ్గించేశారు అన్న దాని మీద టాలీవుడ్ లో కాక రేగుతోంది. అదే టైమ్ లో ఏపీలోని విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

ఏ సమస్యా లేనట్లుగా సినిమా టికెట్ల మీద పడ్డారని కూడా టీడీపీ బీజేపీ సహా అనేక పార్టీలు సర్కార్ మీద విమర్శలు చేస్తున్నాయి. అయితే టికెట్ల సమస్య కాదు వెనకాల అనేక బాధలు ఉన్నాయని అటూ ఇటూ మాటలు చూస్తే అర్ధమవుతోంది. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చిన రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ అయితే ఏపీకి టాలీవుడ్ తో ఏంటి లాభం అని సూటిగానే అనేశారు.

ఏపీ నుంచి డెబ్బై శాతం రెవిన్యూ టాలీవుడ్ కి వస్తోంది. అదే టైమ్ లో ఏపీలో సినిమా యాక్టివిటీ అన్నదే లేదు అని ఆయన అంటున్నారు. ఏపీలో కూడా సినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు సినీ పెద్దలు ముందుకు రావాలని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇక భరత్ కూడా ఒక సినిమా చేసిన హీరోనే అన్నది ఇక్కడ చెప్పాలి.

అంటే ఇది ప్రభుత్వ పెద్దల మనసులో మాటేనా అన్న చర్చ వస్తోంది. గతంలో ఏపీలో స్టూడియోలు కడతామని కొందరు స్థలాలు తీసుకున్నారు. అయితే అవేమీ జరగలేదు, ఇక రమానాయుడు స్టూడియో విశాఖలో ఉంది. అక్కడ కూడా షూటింగులు ఏవీ లేవు. మరి ఏపీలో టికెట్ల మీద గగ్గోలు పెడుతున్న వారు ఎంతో కొంత ఏపీలో తమ యాక్టివిటీని విస్తరిస్తామని చెప్పడంలేదని కూడా అందరిలో భావన ఉంది.

అదే విధంగా ప్రభుత్వం కొత్తగా స్టూడియోలు కడితే స్థలాలు ఇస్తామని చెబుతోందని అంటున్నారు. మరి ఏపీలో టాలీవుడ్ ని విస్తరించడానికి ఎందుకు అభ్యంతరం అంటే చాలానే ఉంది కధ. ఇప్పటికే తెలంగాణా వారు టాలీవుడ్ లో తమ వాటా తేల్చమంటున్నారు. అది అలా ఉంటే హైదరాబాద్ సౌతిండియా చిత్ర పరిశ్రమకు హబ్ గా మారింది.

మూడు దశాబ్దాల క్రితం చెన్నై నుంచి టాలీవుడ్ వచ్చింది. ఆ తరువాత మెల్లగా అన్నీ అక్కడకు వచ్చి చేరాయి. ఈ నేపధ్యంలో ఇపుడు అక్కడ నుంచి ఎంతో కొంత ఏపీకి విస్తరించాలనుకున్నా యావత్తు తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణాను వదిలి వెళ్లిపోతుంది అన్న డౌట్స్ అక్కడ ప్రభుత్వ పెద్దలకు వస్తాయి. దాంతో వారితో సంబంధాలు దెబ్బ తింటాయన్న భయం అయితే సినీ వర్గాలలో ఉందని ప్రచారం సాగుతోంది.

మొత్తానికి ఇంతకాలం ఏపీ నుంచి ఈ తరహా డిమాండ్ రాలేదు కాబట్టి ఏడేళ్ళుగా కధ సాఫీగా సాగింది. ఇపుడు మీతో మాకేంటి లాభం అని అడుగుతున్న వేళ టాలీవుడ్ కూడా రియాక్ట్ కావాల్సి ఉందేమో. నొప్పించక తానొవ్వక అని రెండు రాష్ట్రాలలో తన యాక్టివిటీని కంటిన్యూ చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.



Tags:    

Similar News