అమిత్ షా చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న ఏపీ ఎంపీలు

Update: 2021-10-28 16:48 GMT
ఏపీ రాజకీయాలు ఇప్పుడు హస్తిన చుట్టూ తిరుగుతున్నాయి. అటు అధికారపార్టీ, ఇటు ప్రతిపక్షం ఎవరికి వారు కేంద్రం దృష్టిని ఆకర్షించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ ఎంపీలు కేంద్రమంత్రి అమిత్ షాను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కేంద్రంలో మైలేజ్‌ను పెంచుకునేందుకు వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ.. కాదుకాదు.. టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైసీపీ ఫిర్యాదుల మీదు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వ్యూహాత్మకంగా పైచేయి సాధించేందుకు తెగ ట్రై చేస్తున్నారు. పార్లమెంట్ హాల్లో అమిత్ షాను కలిసేందుకు ఏపీ ఎంపీలు తెగ ఆరాట పడ్డారు. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోటీ పడ్డారు.

తీర ప్రాంత భద్రతపై అమిత్‌ షా ఆధ్వర్యంలో పార్లమెంట్ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన కమిటీ సభ్యులతో మాట్లాడుతూ పార్లమెంట్ లాబీల్లోకి వచ్చారు. షా కోసం ఎదురుచూస్తున్న కనకమేడల ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఎక్కడి నుంచి వచ్చారో ఏమో గాని వైసీపీ ఎంపీ అప్పటికే సిద్దం చేసుకున్న ఒక విజ్ఞాపన పత్రాన్ని అమిత్ షాకు ఇచ్చారు. దాన్ని ఓ సారి పరిశీలించిన కేంద్రమంత్రి తన వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చారు. మాధవ్ తన వినపత్రాన్ని ఇచ్చారా లేదో వెంటనే కనకమేడల అమిత్ షాతో చంద్రబాబు అపాయింట్‌మెంట్ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో కనకమేడలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

మాధవ్ తాను ఇచ్చిన వినతి పత్రంలో సీఎం జగన్‌పై టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను వివరిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తానని అమిత్ షా హామీ ఇచ్చినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో ఏదో ఒక గొడవ సృష్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అమిత్‌షాను కోరామని గోరంట్ల మాధవ్‌ తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీల బృందం సీఈసీని కలిసింది. టీడీపీపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని వైసీపీ ఎంపీలు తెలిపారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి వైసీపీ ఎంపీల విజ్ఞప్తి చేశారు.

టీడీపీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన వెంటనే చంద్రబాబు, అమిత్ షాకు ఫోన్ చేశారు. పార్టీ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఏపీ పరిస్థితులను వివరించేందుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నించారు. అయితే కశ్మీర్ పర్యటన వల్ల చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో రాష్ట్రపతికి కలిసి చంద్రబాబు తిరుగుముఖం పట్టారు. ఏపీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు మీరు తన్నుకుంటూ ఏపీ పరువును ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News