ఏపీ ఒక్క రోజు రికార్డు సక్సెస్ !

Update: 2021-06-20 16:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. కేంద్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఏం చెప్ప‌ద‌లుచుకు న్నారు?

ఎందుకీ ప్రశ్న అడిగారు అనుకుంటున్నారా? దీనికి కారణం... రాష్ట్రంలో చేప‌ట్టి వ్యాక్సినేష‌న్ ప్ర‌త్యేక డ్రైవే! 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల మందికి కోవిడ్‌-19 వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించి.. వెంట‌నే అమ‌లు చేసింది. నిజానికి ఇది మంచి కార్య‌క్ర‌మ‌మే.

క‌రోనాతో అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు ఒకింత ఉప‌శ‌మ‌నం ల‌భించే చ‌ర్య‌లే. బ‌హుశ అందుకే ఈ విష‌యంలో ఎవ‌రూ ఎలాంటి విమ‌ర్శ లూ చేయ‌లేదు. ఆదివారం ఉద‌యం ప్రారంభించిన ప్ర‌త్యేక డ్రైవ్ సాయంత్రానికి దాదాపు ల‌క్ష్యం చేరుకుంది. అయితే.. ఈ క్ర‌మంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాలు చేసిన వ్యాఖ్య‌లు మాత్రం.. ఈ కార్య‌క్ర‌మం వెనకాల ఉన్న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 96 లక్షల మందికి ఒక్క డోస్ వ్యాక్సిన్ ఇవ్వగలిగామన్న సింఘాల్.. కేంద్రం నుంచి కొత్తగా వచ్చిన 9 లక్షల డోసులు ఈ ఒక్కరోజే వేయాలని డ్రైవ్ చేపట్టామని వివరించారు.

ఆదివారం ఒక్క రోజే 9 లక్షలకుపైగా వాక్సిన్లు వేసి.. రాష్ట్రంలో వాక్సినేషన్ సామర్ధ్యంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యే ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై వ్యాక్సిన్ ఇవ్వ‌లేక పోయార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. పైగా.. ఉచితంగా ఇవ్వ‌లేద‌ని.. అమ్ముకున్నార‌ని.. తీవ్ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఏకంగా 10 ల‌క్ష‌ల మందికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వ‌డం అది కూడా కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ చేప‌డుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం అంటే.. మోడీ సర్కారు కంటే ఏపీ సర్కారు మరింత వేగంగా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తోందా? అంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఇది ఏపీ సంచలన రికార్డు అని చెప్పొచ్చు.




Tags:    

Similar News