దావోస్ లో ఏపీ పెవిలియన్

Update: 2022-05-20 06:30 GMT
స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ లో జరగనున్న  అంతర్జాతీయ ఆర్ధిక సదస్సులో ఏపీ పెవిలియన్ ఏర్పాటైంది. శనివారం నుండి నాలుగురోజులపాటు జరిగే అంతర్జాతీయసదస్సులో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు కూడా బయలుదేరారు. దావోస్ సదస్సులో  చాలాకాలంగా ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

తాజా సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బకా కార్పొరేట్లు, ఆర్ధికరంగంలోని నిపుణులు పాల్గొంటారు. మనదేశం నుండి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు, ముఖేష్ అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు కూడా పాల్గొనబోతున్నారు. ఇలాంటి సదస్సులో ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు ప్రత్యేకంగా పెవిలియన్ ఏర్పాటు చేసుకుంటాయి.

ఇందులో భాగంగానే ఏపీ తరపున ప్రత్యేకంగా ఒక పెవిలియన్ ఏర్పాటైంది. సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలను కలిసి పెట్టుబడులు పెట్టే విషయంలో ఏపిలో ఉన్న అవకాశాలను వివరించేందుకు జగన్ అండ్ కో రెడీ అయ్యింది. ఈ సదస్సులో ఆహారం, వాతావరణంలో మార్పులు, సాంకేతికరంగంలో నూతన ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్ సెక్యూరిటి, రియల్ ఎస్టేట్, పునర్నిర్మాణం లాంటి రంగాలపై ఎక్కువగా దృష్టి ఉండే అవకాశముంది.

సదస్సులో జగన్ పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, ఏఏ రంగాల్లో పెట్టబడులు పెట్టవచ్చు. పెట్టుబడులు పెట్టడంవల్ల పారిశ్రామికవేత్తలకు కలిగే లాభాల్లాంటి విషయాలను వివరించనున్నారు.

ఈ సదస్సులో అంతర్జాతీయస్ధాయి పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే అవసరమైన సమాచారం అంతా ఇచ్చి వారిని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానిస్తారు.

తర్వాత వాళ్ళు రాష్ట్రానికి వచ్చినపుడు క్షేత్రస్ధాయిలో ఉన్న అవకాశాలు చూపించి సానుకూలంగా స్పందిస్తే పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటారు. జగన్ మొదటి మూడేళ్ళు సంక్షేమపథకాల అమలు, చివరి రెండేళ్ళు అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెట్టనున్నట్లు అర్ధమవుతోంది. మరి జగన్ దావోస్ పర్యటన విజయవంతమవుతుందా ?
Tags:    

Similar News