బాబుపై కక్ష...ఏపీ ప్రజలకు శిక్ష

Update: 2018-12-28 17:30 GMT
తుంటిపై కొడితే పళ్లు రాలాయని సామేత. భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీల మధ్య వివాదం ఈ సామేతలాగే ఉంది. 2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం అటు కేంద్రంలోను - ఇటు ఆంధ్రప్రదేశ్‌ లోను స్వర్గం చూపిస్తామంటూ ఓట్లు వేయించుకున్నారు. నాలుగేళ్ల పాటు ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. గడిచిన ఎనిమిది నెలలుగా ఈ పార్టీల మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ కు రావాల్సిన నిధులు ఇతర పథకాలు అమలు కావడం లేదంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకుంటూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటున్నారు. వీరిద్దరి మధ్య వైరం వటుడింతై అన్నట్లుగా రోజురోజుకి పెరుగుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎక్కువగా పడుతోంది. ప్రజలకు అందాల్సిన పథకాలేవి కూడా వారికి చేరడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామంటూ విభజన ముందు ప్రకటించారు. విభజన చట్టంలోను ఆ అంశాన్ని పొందుపరిచారు. 2014 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ హోదాను ప్రక్కన పెట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని - బతుకులు బాగుపడతాయనుకున్న ఏపీ ప్రజలకు నిరాశే ఎదురైంది. హోదా సాధించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలంటూ కూని రాగాలు తీసారు. నాలుగేళ్లు గెలిచాక ఎన్నికల ముందు మళ్లీ హోదా రాగం ఆలపిస్తున్నారు. హోదా ఇవ్వని బిజేపీని వ్యతిరేకించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అటు నరేంద్ర మోదీ - ఇటు చంద్రబాబు నాయుడుల కక్ష రాజకీయాల మధ్య ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఇద్దరు అగ్రనాయకులకు ఒకరిపై ఒకరికి ఉన్న కక్ష ఏపీ ప్రజలకు శిక్షగా మారిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ హోదా ఇస్తామంటూ ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. అంటే తన అవసరమే తప్ప ప్రజల అవసరాలు - రాష్ట్ర అభివ్రుద్ది వంటివి చంద్రబాబుకు పట్టవా అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కక్ష రాజకీయాలకు ఫుల్‌ స్టాప్ పెట్టి రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని వారు అంటున్నారు.
Tags:    

Similar News