ఏపీ రాజకీయం ...రంగా జపం!

Update: 2022-11-03 02:30 GMT
ఈ రోజు ఏపీ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు వంగవీటి మోహన రంగా. ఆయన ఇప్పటికి ముప్పయి నాలుగు ఏళ్ళ క్రితం దారుణ హత్యకు గురి అయ్యారు. 1988 డిసెంబర్ 26న రంగా హత్య జరిగింది. ఆనాడు ఆయన విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల కోసం ఆయన తలపెట్టిన అమరణ దీక్ష కీలక దశకు చేరుకున్న సందర్భం అది. ఒక వైపు ఏపీలో ఎన్టీయార్  ప్రభుత్వం అధికారంలో ఉంది.

దానికంటే ముందు వంగవీటి రంగా రాజకీయంగా ఎదిగిన క్రమం, ఆయన బలమైన టీడీపీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టిన నేపధ్యం గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతూంటారు. రంగా 1981లో జరిగిన విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కార్పోరేటర్ పదవికి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత ఆయన అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ కోన ప్రభాకరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంగా అనతికాలంలోనే విజయవాడ రాజకీయాల్లో కీలకం అయ్యారు. ఇక 1983లో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆ టైం లో పీసీసీ చీఫ్ పదవి డాక్టర్ వైఎస్సార్ కి దక్కింది. ఆయన రంగాలోని డైనమిక్ లీడర్ షిప్ చూసి ఆయనకు విజయవాడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. అలా వైఎస్సార్ రంగాల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది అని చెబుతారు. ఇక అ 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రంగాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా వచ్చింది. రంగా అంతటి తెలుగుదేశం వేవ్ లో కూడా గెలిచి తన సత్తా చాటారు. ఆయన ఎమ్మెల్యేగా అలుపెరగని పోరాటం చేశారు. ఆయన చివరి సారిగా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ తన ప్రాణానికి హాని ఉందని చెప్పారు.

ఆ తరువాత ఆయన అమరణ నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఆయన దానికంటే ముందు అదే ఏడాది  ఫస్ట్ టైం కాపునాడుని ప్రారంభించి కోస్తా జిల్లాలలో ఉన్న కాపులను ఏకత్రాటి మీద నడిపించే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఆయన చాలా డేరింగ్ గా తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద పోరాడడమే కాదు నిగ్గదీసేవారు. అయితే ఆయన అమరణ దీక్షలో ఉండగా దారుణ హత్యకు గురి కావడంతో ఏపీ అంతా అట్టుడికింది. ఆనాడు విజయవాడ ఏకంగా నెల రోజుల పాటు కర్ఫ్యూలో ఉందంటే రంగా హత్య తరువాత ఎంతటి రాజకీయ ప్రకంపనలు ఏపీని కుదిపేశాయో చరిత్ర పుటలలో ఈ రోజుకీ పదిలంగా ఉంది మరి.

రంగా పేదల పెన్నిధి అని ఆయన కేవలం కాపు నాయకుడు కాదని అంటారు.   ఏది ఏమైనా రంగా వంటి టవరింగ్ పర్సనాలిటీ కేవలం నాలుగు పదుల వయసులో దారుణ హత్యకు గురి అయి లోకం వీడడం బాధాకరమే. అంతే కాదు ఆయన సొంత సామాజికవర్గంతో పాటు పీడిత తాడిత ప్రజానీకానికి కూడా అది ఎప్పటికీ తీరని లోటే అని అంటారు. ఇదిలా ఉంటే  2024  ఎన్నికల్లో  వంగవీటి మోహన రంగా ప్రభావం కచ్చితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే అన్ని రాజకీయ పార్టీలు రంగా జపం చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News