ఏపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రేపే, తేల‌ని లెక్క‌!

Update: 2020-03-05 07:00 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ కోటాలో జ‌ర‌గాల్సిన రాజ్య‌స‌భ స‌భ్యుల ఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ రేపు విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఏపీ ఎన్నిక‌ల ముఖ్య అధికారి కే విజ‌యానంద్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌త చేశారు. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ ప్ర‌కారం.. ఆరో తేదీన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ముప్పై వ తేదీ నాటికి రాజ్య‌స‌భ స‌భ్యుల ఎన్నిక ప్ర‌క్రియ పూర్తి అవుతుంద‌న్నారు.

మొత్తం న‌లుగురు స‌భ్యుల ఎన్నిక‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, ఒక‌వేళ నాలుగుకు మించి నామినేష‌న్లు దాఖ‌లు అయితే పోలింగ్ జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. 26 వ‌తేదీని పోలింగ్ తేదీగా ప్ర‌క‌టించారు. అయితే..ఈ ఎన్నిక పోలింగ్ కు దారి తీసే అవ‌కాశం లేన‌ట్టే.

ఏపీ కోటాలో మొత్తం నాలుగు రాజ్య‌స‌భ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ నాలుగూ మ‌రో వాద‌న లేకుండా అధికార‌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ద‌క్కుతాయి. ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీకి ఒక్క సీటు ద‌క్కే అవ‌కాశం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో ఏక‌గ్రీవం గానే ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి కానున్న‌ట్టే.

అయితే ఇంత‌కీ అధికార పార్టీ త‌ర‌ఫున ఆ న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఎవ‌ర‌నేది ఆస‌క్తి దాయ‌కంగా మారింది. ఇప్ప‌టికే ఈ విష‌యం లో చాలా చాలా పేర్లు వినిపించాయి. నాలుగు సీట్ల‌కూ ఏడెనిమిది మంది నేత‌ల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దే తుది నిర్ణ‌యం అనే సంగ‌తీ వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు, పార్టీలోని ఆశావ‌హులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా.. జ‌గ‌న్ నిర్ణ‌యమే ఫైన‌ల్ అవుతుంది. అందులోనూ ఒక సీటును బీజేపీ కోటాకు ఇవ్వ‌డానికి జ‌గ‌న్ సానుకూలంగా ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ సీటును అంబానీ స‌న్నిహితుడికి కేటాయించ‌నున్నార‌నే టాక్ ఉంది. కాబ‌ట్టి వైసీపీ లో ఆశావ‌హుల‌కు మూడు సీట్లు మాత్ర‌మే మిగిలిన‌ట్టు. ఆరేడు మంది నేత‌లు ఈ విష‌యంలో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి వారిలో జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చేది ఎవ‌రిక‌నేది ఇంకా స్ప‌ష్ట‌త లేని అంశ‌మే!
Tags:    

Similar News