సర్వేలను మించిన సర్వేలు : ఎంత చెడ్డా ఆ సీట్లు రాకపోతాయా...?

Update: 2022-06-29 01:32 GMT
ఏపీలో సర్వేలకు ఇంకా సమయం రాలేదు. అయితే వివిధ పార్టీలు తమ వారితో చెప్పించుకుని అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ సర్వేలు అధికార పార్టీ వైసీపీలో కంగారు పెంచుతూంటే విపక్ష టీడీపీలో కొత్త ఆశలు మొలకెత్తేలా చేస్తున్నాయి. ఏపీ జనాలు వైసీపీ పాలనతో విసిగి ఉన్నారని అందువల్ల రేపటి ఎన్నికల్లో గుత్తమొత్తంగా టీడీపీకి గుద్దేస్తారు అని పసుపు పార్టీ సంబరపడుతోంది. దాంతో ఆ పార్టీ ఒకే ఒక నంబర్ పట్టుకుని అక్కడే స్టికాన్ అయి పోయింది.

మాకు వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయని ఏ ముహూర్తాన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అన్నారో కానీ అదే మాట తారకమంత్రం అయింది. ఆఖరుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా 160 సీట్లు మాకే అంటున్నారు. అది కూడా పొత్తులు లేకుండా. ఇలా టీడీపీ ధీమా బాగా పెరుగుతోంది.

మరి వైసీపీలో సీన్ ఎలా ఉంది అంటే 151 సీట్ల నుంచి 175 సీట్ల దాకా రావాల్సిందే అని జగన్ అంటున్నారు. అయితే పార్టీ మీటింగులో ఆయన దీని మీద ఎంత మాట్లాడినా అసలు విషయం ఆ పార్టీ వారికీ తెలుసు. అయితే వారిలో కూడా కొన్ని ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ అలాగే చెబుతుంది. ఆ పార్టీ మొదటి నుంచి అలాగే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఎపుడు వైసీపీ విజయాన్ని ఒప్పుకుంది కనుక అని వైసీపీ నేతలు కొందరు అంటున్నారు.

మాకు జగన్ చెప్పినట్లుగా 175 సీట్లు రాకపోవచ్చు. 2019 నాటి 151 సీట్లు కూడా చాలా కష్టం. అయితే ఎంత చెడ్డా వంద సీట్లకు తక్కువ రాకుండా పోతాయా అన్నదే మా ఆశ అని ఆ పార్టీ వారు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు. అంటే తమ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతతో 51 సీట్లకు మంగళం పాడడం ఖాయమని ఆ పార్టీలోనే ఒప్పుకుంటున్నారు అని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం 120 సీట్ల దాకా రావచ్చు అని లెక్కలు వేస్తున్నారు.

ఇవన్నీ కూడా రొడ్డ కొట్టుడు లెక్క తప్ప ఏ సర్వే కాదు, జనం నాడిని చూసి చెప్పినది అంతకంటే కాదు. అయితే వైసీపీ విషయంలో మాత్రం  ఈ  వీర లెవెల్ జోస్యాలు మాత్రం చెబుతున్నారు. ఇదమిద్దంగా తేలేది ఏంటి అంటే వైసీపీ కచ్చితంగా ముప్పయి నుంచి యాభై సీట్లను కోల్పోతుంది అని వైసీపీ వారే అంటున్నారు అని చెబుతున్నారు మరి ఎన్నికల నాటికి చూస్తే మరో ఇరవై సీట్లు పోతే ఇక అధికారం ఏమొస్తుంది అన్న మాటా ఉంది.

ఏది ఏమైనా వైసీపీ నేతలు బయట అనుకుంటున్నట్లుగా గ్రౌండ్ లెవెల్ లో సీన్ లేదని అర్ధమైపోతోంది. ఇక చేసేందుకు కూడా రెండేళ్లలో ఏమీ లేకపోవడం వల్లనే వైసీపీ నేతలు ఇపుడు మళ్ళీ మాదే అధికారం అని లెక్కలేవో చెబుతున్నారు అని టీడీపీ వారు ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఏపీలో జగన్ ఒక విచిత్రమైన రాజకీయ  ప్రయోగం చేశారు.

ప్రగతి దారులను వదిలేసి నేరుగా జనాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాటి ఫలాలు ఫలితాలు ఈ ఎన్నికలో ఏమిటన్నవి  తేలిపోతాయి. మరి జనాలు వైసీపీకి జేజేలు పలికితే దేశమంతా ఈ ఫార్ములాను అనుసరిస్తుంది. అపుడు అభివృద్ధి పక్కన పెట్టేసి పంచుడే అన్న మాట.  అలా కాదు అనుకుంటే మాత్రం ఏపీ దేశానికి ఒక గొప్ప గుణపాఠం చెప్పినట్లుగా కూడా ఉంటుంది. మొత్తానికి చూస్తే ఏపీలో జరిగే ఎన్నికలు ఒక గొప్ప దిశా నిర్దేశం అయితే దేశానికి చేస్తాయనడంతో సందేహం లేదు అంటున్న వారు ఉన్నారు.
Tags:    

Similar News