సూప‌ర్ పోస్టులు ప‌ట్ట‌వా సారు...

Update: 2015-05-25 04:57 GMT
అంగ‌ట్లో అన్నీ ఉన్నా... అల్లుడినోట్లో శ‌ని అన్న‌ట్లుంది తెలంగాణ ఉద్యోగుల ప‌రిస్థితి. తెలంగాణ రాష్ర్టంలో స్వయం పాలన మొదలై ఏడాది పూర్తి కావస్తున్నా... తాము ప‌రాయి వారిలా ఏపీలో ప‌నిచేయాల్సి వ‌స్తోందంటూ వాపోతున్నారు. వివిధ వర్గాలు వార్షికోత్సవాల్లో పాల్గొని సంబరాలు చేసుకుంటుంటే...మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఉద్యోగులు మాత్రం సొంత రాష్ర్టానికి దూరంగా ఏపీలోనే  ఉండిపోయామ‌ని ఆవేద‌న చెందుతున్నారు. రాష్ర్టం వచ్చిన వెంటనే ఎక్కడివారు అక్కడికే తీసుకొస్తాం...ఇదేమీ పెద్ద పని కాదని చెప్పిన సీఎం కేసీఆర్ ఇంత వరకు వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విభజనలో భాగంగా అలాట్‌ అయిన ఉద్యోగుల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఒక రాష్ర్టానికి చెందిన వారిని మరో రాష్ర్టానికి కేటాయించడంతో.. సూపర్‌ న్యూమరీ పోస్టులు ఏర్పాటు తప్పనిసరి అయ్యింది. తాము సొంత రాష్ర్టంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగులు ఇప్పటికే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలను, కమల్‌నాథన్‌ కమిటీని కోరారు. సూపర్‌ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

జూన్‌ 2న రాష్ర్టం ఏర్పడగానే తెలంగాణ రాష్ర్ట పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించారు. అనంతరం ఉద్యోగుల విభజనపై కమల్‌నాథన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 10 నెలలుగా హోంవర్క్‌ చేసిన కమల్‌నాథన్‌ కమిటీ.. రాష్ర్ట స్థాయి పోస్టుల వారిగా ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపును చేపట్టింది. 25 శాఖల్లో ఉద్యోగులను ఇరు రాష్ర్టాలకు కేటాయించింది. ఇక ఉద్యోగులు తమ అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో తెలపాలని కమల్‌నాథన్‌ కమిటీ కోరింది. మరోవైపు సూపర్‌ న్యూమరీ పోస్టులపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారి కోసం సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టిస్తే తప్పా... తెలంగాణలో పనిచేసేందుకు వీలుకాదు. 400 మంది ఉద్యోగుల కోసం సూపర్‌ న్యూమరీ పోస్టులు క్రియేట్‌ చేయాలని సీఎంకు లేఖ రాశామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

విభజన పూర్తయ్యాకే సూపర్‌ న్యూమర‌రీ పోస్టుల క్రియేషన్‌, భర్తీ అంటోంది తెలంగాణ‌ ప్రభుత్వం. ఈ అభిప్రాయంతోనే పోస్టులను సృష్టించడానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదనే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఏడాది పట్టవచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సూపర్‌ న్యూమరీ పోస్టుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News