ఏపీ వర్సెస్ తెలంగాణ: కేసీఆర్ భూముల డిమాండ్ కరెక్టేనా?

Update: 2021-03-28 16:30 GMT
ఇంచు భూముల కోసం కొట్టుకు చస్తున్న రోజులివీ.. ఈ ప్రపంచం మీదే జనాభా పెరిగి.. కాసుల సామర్థ్యం పెరిగిన వేళ ‘భూమి బంగారమైంది’. భూముల రేట్లు చుక్కలనంటాయి. కార్పొరేట్లు, ఉద్యోగులు, వ్యాపారులు ఇప్పుడు అన్నింటికంటే మెరుగైన పెట్టుబడి భూములు అని వాటి మీదే పెట్టేస్తున్నారు. తెలంగాణలో రైతు బంధు, దేశమంతా కిసాన్ యోజన కింద వేలకు వేలు ఏడాదికి రెండు మూడు సార్లు ఇస్తుండడంతో భూములకు భారీ రేటు వచ్చింది. లక్షలు, కోట్లు ధరలు పలుకుతున్నాయి. కరోనా కల్లోలం లోనూ భూముల రేట్లు తగ్గక పోగా మరింత ప్రియం అయ్యాయి.

తాజాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ‘ఏపీలో సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు తెలంగాణలో నాలుగు ఎకరాలు అమ్మితే ఏపీలోని వెనుకబడి ప్రకాశం జిల్లాలోనే ఒక ఎకరం కొనడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, కాళేశ్వరం కట్టాక తీసుకున్న చర్యల కారణంగా ఇక్కడ భూములకు రెక్కలు వచ్చాయి. ఏపీ పని రివర్స్ అయ్యింది. ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో నాలుగు ఎకరాలు కొనొచ్చు’ అని కేసీఆర్ అసెంబ్లీలో అన్న మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి.

కేసీఆర్ రైతు బంధు ఇవ్వకముందు, కాళేశ్వరంతో సాగునీటి వసతి కల్పించకముందు తెలంగాణలో భూములకు అస్సలు పెద్దగా డిమాండ్ లేకుండేది. హైదరాబాద్ చుట్టుపక్కల తప్పితే తెలంగాణ జిల్లాల్లో చాలా తక్కువ రేట్లు ఉండేవి. కానీ కేసీఆర్ పథకాలతో అమాంతం భూముల రేట్లు మూడు రెట్లు  పెరిగాయి.అది వాస్తవమే. అయితే ఏపీలో సీన్ రివర్స్ అయ్యిందన్న కేసీఆర్ మాటలను అక్కడి నేతలు, రియల్ వ్యాపారులు, ప్రజలు కొట్టిపారేస్తున్నారు.

ఏపీలో అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించాక అక్కడికి హైదరాబాద్ నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సహా అందరూ తరలివచ్చి పెట్టుబడులు పెట్టారు. భూములు కొన్నారు. భారీరేట్లు పలికాయి. అయితే జగన్ సర్కార్ ఇప్పుడు విశాఖకు తరలిపోవడంతో అమరావతిలో భూముల డిమాండ్ పడిపోయింది. కానీ మరీ తీసిపారేసేంతగా కాదు.

ఇక గడిచిన కొన్నేళ్లుగా మోడీ సర్కార్ వచ్చాక దేశమంతా భూముల రేట్లు పెరిగాయి. ఏపీలోనూ డబుల్ అయ్యాయి. గోదావరి, ఉత్తరాంధ్ర,గుంటూరు, కృష్ణ వరకు కూడా ఎకరం భూములు కొనడం సామాన్యులకు అందని ద్రాక్షే. లక్షలు, కోట్లు పెట్టాల్సిందే. వెనుకబడిన నీటి వసతిలేని ప్రకాశం జిల్లాలో, అనంతపురంలోనే కాస్త రేటు తక్కువ. మిగతా అన్ని చోట్ల బోలెడు డిమాండ్ ఉంది. తెలంగాణను మించి ధరలు ఏపీలో ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణలో ఇప్పుడు భూములు సస్యశ్యామలం అయ్యి రేట్లు పెరిగాయి. కానీ ఏపీలో ఎప్పటి నుంచో కాలువలు, సాగునీటి వసతితో కోట్లలో రేట్లు భూములకు ఉన్నాయి. కేసీఆర్ ఉదహరించింది కేవలం ప్రకాశం జిల్లాకు మాత్రమేనని ఏపీ జనాలు అంటున్నారు. మిగతా ప్రాంతాల్లో భూములకు చుక్కలనంటే రేట్లు ఉన్నాయంటున్నారు.

యాథావాత చెప్పొచ్చేది ఏంటంటే.. తెలంగాణ, ఏపీ సహా అంతటా భూములకు రేట్లు డబులు, త్రిబుల్ అయ్యాయి. సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోయాయి. తెలంగాణలో ఇప్పుడు భూమ్ వచ్చింది. కానీ ఏపీలో ఆది నుంచి డిమాండ్ ఉంది. సో కేసీఆర్ వాదనను ఏపీ జనాలు కొట్టిపారేస్తున్నారు.
Tags:    

Similar News