కలాంను రాష్ట్రపతి చేసిందెవరు?

Update: 2015-07-28 10:21 GMT
అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందెవరు... ? ఆయన్ను ఆ పీఠం పైన కూర్చుండబెట్టడంలో అనేక మంది పాత్ర ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికంటే ముఖ్య భూమిక పోషించారు. 2002లో కలాం రాష్ట్రపతి అయ్యారు. అప్పుడు కేంద్రంలో అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నారు. భారత రాష్ట్రపతిగా మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని అప్పటి ప్రధాని వాజపేయి గట్టి పట్టుపట్టారు... ముగ్గురు మైనార్టీ నేతల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి, ఎన్డీయే కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేశారు. జాబితాలో మూడు పేర్లలో అబ్దుల్ కలాం పేరును చంద్రబాబు రెండో ఆలోచనకు తావు లేకుండా ఆమోదం తెలిపారు... దాంతో ఆ మేధావి రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారు.

అయితే... శాస్త్రవేత్తగా ఉన్న కలాం రాష్ట్రపతి పదవి చేపట్టడానికి అంగీకరిస్తారా అని వాజపేయి సందేహించారట... అదే సందేహాన్ని చంద్రబాబు ముందుంచితే కలాంను ఒప్పించే బాధ్యత తనదంటూ ఆయన వెంటనే కలాంను సంప్రదించారు.  అయితే... కలాం తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని.. రాజకీయాలతో సంబంధమున్న ఇలాంటి పదవులు తనకెందుకని సున్నితంగా తిరస్కరించారని.. అయితే... దేశానికి కలాం వంటివారి అవసరం ఉందని చెబుతూ ఆయన్ను ఒప్పించారట. కాగా ముగ్గరు పేర్లతో జాబితా తయారు చేసింది వెంకయ్యనాయుడు అని.. ఆ రకంగా ఆయన కూడా కలాంను రాష్ట్రపతి చేయడంలో ఓ చెయ్యేసారని చెబుతుంటారు. ఎవరైతేనేం... ఎలా అయితేనేం... తెలుగువాళ్లే ఈ జాతి రత్నాన్ని దేశానికి అందించారనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News