ఏపీలో ఎంపీలెక్క‌డ‌?

Update: 2022-08-01 06:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎంపీలెక్క‌డ అని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ప‌లు జిల్లాల్లో ప‌రిస్థితి బీభ‌త్సంగా మారింది. పంట‌లు నీట‌మునిగాయి.. ప‌లు చోట్ల ఇల్లు కూలాయి.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మయ‌మ‌య్యాయి. ప‌శువులు కూడా మృత్యువాత ప‌డ్డాయి. అయినా ఎక్క‌డా ఎంపీలు క‌నిపించ‌డం లేదు. ఏపీలో మొత్తం 25 మంది లోక్ స‌భ ఎంపీలు ఉన్నారు. వీరిలో 22 మంది వైఎస్సార్సీపీ ఎంపీలే. వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తూర్పుగోదావ‌రి (కాకినాడ‌, అమ‌లాపురం, రాజ‌మండ్రి), ప‌శ్చిమ గోదావ‌రి (ఏలూరు) ప్రాంతాల్లో వ‌ర‌దల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డా ఒక్క ఎంపీ కూడా రాలేద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు ఎంపీలు లోక్ స‌భ స‌మావేశాల‌ప్పుడు త‌ప్పితే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తుందే లేద‌ని అంటున్నారు. చాలామంది ఎంపీలు ఢిల్లీకి ప‌రిమిత‌మ‌వ్వ‌డం, అలాగే మ‌రికొంత మంది ఎంపీలు వ్యాపారాలు చూసుకోవ‌డం, కాంట్రాక్టులు చేసుకోవ‌డం వంటివి మాత్ర‌మే చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌ప్ప‌డు మాత్ర‌మే టీవీల్లో క‌నిపిస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు. మిగ‌తా రోజుల్లో ఎవ‌రివైనా సెల‌బ్రిటీల పిల్ల‌ల పెళ్లిళ్లు, పేరంటాళ్ల‌లో త‌ప్పితే ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని చ‌ర్చ సాగుతోంది.

ఏ ఒక్క ఎంపీ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండ‌టం, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌డం వంటివి చేయ‌ట్లేద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం అంటూ ఒక‌టి పెట్టారు. ఇందులో భాగంగా కేవ‌లం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు మాత్ర‌మే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. ఎంపీలు ప్ర‌జ‌ల ముఖం చూసిందే ఉండ‌టం లేద‌ని చెబుతున్నారు.

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎంపీలు పాల్గొన‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాలు ఏమైనా జారీ చేశారా అని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని.. ప‌రిష్క‌రించ‌డానికే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఎంపీలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ నిర్వ‌హించ‌డం లేద‌ని నిల‌దీస్తున్నారు.

పోనీ లోక్ స‌భ‌లో ఏమైనా కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసి ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ఏమైనా అడుగుతున్నారా అంటే అదీ లేద‌ని చెబుతున్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, పోల‌వరం ప్రాజెక్టు, ఏపీ విభ‌జ‌న అంశాలు, రైల్వే జోన్, రాష్ట్రంలో కేంద్ర సంస్థ‌ల ఏర్పాటు ఇలా ఎన్నో రావాల్సిన‌వి ఉన్నాయి. వీటిపైన కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్న ఒక్క ఎంపీ కాగ‌డా వేసి వెతికినా క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు. కేవ‌లం టీ, కాఫీలు తాగ‌డానికి మాత్ర‌మే ఎంపీలు ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు.

అస‌లు లోక్ స‌భ ఎంపీ అంటే ఆ ప‌ద‌వి త‌క్కువేమీ కాదు. నాలుగైదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌జ‌ల త‌ర‌ఫున దేశ పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హించే వ్య‌క్తి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను దేశ స్థాయిలో చ‌ర్చ‌కొచ్చేలా చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఎంపీల‌కు ఉంటుంది. అయితే విచిత్రంగా ఎంపీలు త‌మ ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డానికి, ఏదో విహార యాత్ర‌ల‌కు వెళ్లొచ్చిన‌ట్టుగానూ ఢిల్లీకి వెళ్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌లు ఎంపీలను డ‌మ్మీలుగా చూస్తున్నారా అనే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జాప్ర‌తినిధులు అంటే కేవ‌లం ఎమ్మెల్యేలేనా.. ఎంపీలు కాదా అని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News