ఈవ్.. యాపిల్ బంధం ముగుస్తోంది?

Update: 2019-06-29 04:50 GMT
ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యానికి ఏ మాత్రం సంబంధం లేద‌నిపించే విష‌యమే కావొచ్చు. కానీ.. క‌లిపి ఆలోచిస్తే నిజ‌మే క‌దా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. బైబిల్ ప్రకారం ఈవ్ (భూమి మీద పుట్టిన తొలి మ‌హిళ‌).. ఆడ‌మ్ ల సంతాన‌మే మ‌నిషి ప‌రిణామ‌క్ర‌మం. అందులో ఆడ‌మ్ ఎంత ముఖ్య‌మో ఈవ్ అంతే ముఖ్యం. అన్నింటికి మించి యాపిల్ మ‌రింత ముఖ్యం.

చూసినంత‌నే తినాల‌నిపించేలా ఉన్న యాపిల్ ను తినొద్ద‌ని హెచ్చ‌రించినా ఈవ్ తిన‌టం తెలిసిందే. అదో పురాణం. దాన్ని అలా ప‌క్క‌న పెడితే.. ఇప్పుడదే పేరున్న వ్య‌క్తి యాపిల్ ను వీడిపోవాల‌నుకోవ‌టం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న వార్త‌గా మారింది. యాపిల్ ను వీడిపోనున్న ఈవ్ అంటూ బిజినెస్ చాన‌ళ్ల‌లో అయితే బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. ఇంత‌కీ ఈ ఈవ్ ఎవ‌రంటారా?  అక్క‌డికే వ‌స్తున్నాం.

ఐఫోన్.. ఐపాడ్ అన్న పేర్లు విన్నంత‌నే గుర్తుకు వ‌చ్చేది యాపిల్ కంపెనీ. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన బ్రాండ్ గా ఉన్న పేరు ఎలాంటిదో తెలిసిందే. యాపిల్ కు ఇంత కీర్తిప్ర‌తిష్ఠ‌ల వెనుక కీల‌క‌మైన వ్య‌క్తి ఒక‌రున్నారు. యాపిల్ ఉత్ప‌త్తుల్ని చూసినంత‌నే కొనుగోలు చేసేలా టెంప్ట్ చేసే డిజైన్ల వెనుక ఉన్న ప్ర‌ముఖుడే యాపిల్ చీఫ్ డిజైన‌ర్ ఈవ్.  యాపిల్ కంపెనీలో చేరి.. 1997 నాటికి కంపెనీకి రిజైన్ చేయాల‌ని డిసైడ్ అయిన అత‌గాడి ఆలోచ‌న‌ల‌కు బ్రేక్ వేశారు స్టీవ్ జాబ్స్. డిజైన‌ర్ గా అత‌డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వ‌టంతో ప్ర‌పంచంలోనే కంపెనీ ప్ర‌ముఖ‌మైన‌దిగా మార‌టానికి కార‌ణ‌మైన ఉత్ప‌త్తుల్ని డిజైన్ చేయ‌గ‌లిగారు.

ఈ రోజున యాపిల్ డిజైన్ కు ఇంత పేరు ప్ర‌ఖ్యాతులు వ‌చ్చాయంటే దాని వెనుక  చీఫ్ డిజైన‌ర్ ఈవ్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఉండ‌లేం. అలాంటి ఈవ్ తాజాగా కంపెనీని వీడి వెళ్లిపోయే టైం వ‌చ్చేసింది. యాపిల్ తో త‌న సుదీర్ఘ ప్ర‌యాణానికి బ్రేక్ చెబుతూ.. తానే సొంతంగా ఒక సంస్థ‌ను నెల‌కొల్పుతున్నారు. ఈవ్ నేతృత్వంలోనే యాపిల్ ఐమ్యాక్.. త‌ర్వాతి రోజుల్లో ఐఫోన్.. ఐపాడ్.. మాక్ బుక్ ఎయిర్ లాంటివాటికి ప్రాణం పోశాడు.

కంపెనీలోనే ఒక సీక్రెట్ డిజైన్ స్టూడియోలో వీటిని రూపొందించిన‌ట్లుగా చెబుతారు. వినియోగ‌దారుల మ‌న‌సు దోచుకోవ‌టంతో పాటు.. అనేక అంత‌ర్జాతీయ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈవ్.. రానున్న‌రోజుల్లోనూ ఆయ‌న‌ యాపిల్ తో క‌లిసి ప‌ని చేస్తారంటూ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ఇక‌.. ఈవ్ పెట్ట‌నున్న కొత్త కంపెనీ పేరు ల‌వ్ ఫ్ర‌మ్. మ‌రో ఏడాదిలో పూర్తిస్థాయి సేవ‌ల్ని అందించే అవకాశం ఉన్న ఈ కంపెనీతో తాము క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కుక్ చెప్పారు. ఐమ్యాక్ నుంచి ఐఫోన్ల వ‌ర‌కూ ఈవ్ ప్రాణం పోశాడ‌ని.. ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే విష‌యంలోనూ ఆయ‌న నైపుణ్యాన్ని తాము వాడుకుంటామ‌న్నారు. మ‌రీ బంధం ఎంత‌కాలం నిలుస్తుంద‌న్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. ఈవ్ ను మిస్ అవుతున్న యాపిల్ రానున్న రోజుల్లో ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటుందో చూడాలి.


Tags:    

Similar News