ఈసారి ఆపిల్స్ తో చిల్లర బెదిరింపులు!

Update: 2016-10-08 11:51 GMT
మొన్న పావురం కాలిగి కాగితం కట్టి భారత్ కు పంపారు... ఆ కాగితంపై బెదిరింపు వాక్యాలు రాసి ఉన్నాయి. తర్వాత గాలిబుడగలపై బెదిరింపు మాటలు రాసి సరిహద్దుల్లో భారత సైన్యం ఉన్న వైపు వచ్చేలా ఎగరేశారు. ఇలాంటి చిల్లర పనులు పాక్ వైపు నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. పాత సినిమాల్లో స్మగ్లర్స్ వాడినట్లు పావురాళ్ల కాళ్లకు మెసేజ్ లు కట్టడం, చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లు బుడగలపై ఏవో రాసి పంపడం... అవే చాలా చవకబార్లు వేషాలు అని బావిస్తున్న తరుణంలో పాక్ నుంచి మరో బెదిరింపు సందేశాలు - జాతి వ్యతిరేక నినాదాలు వచ్చాయి... అయితే ఈ సారి ఈ చిల్లర పనికి ఎంచుకున్న మార్గం ఆపిల్స్.

అవును, నిన్నటివరకూ పావురాలు - బెలూన్లు తరువాత ఇప్పుడు ఆపిల్స్‌ జాతి వ్యతిరేక - ద్వేష పూరిత సందేశాలకు వేదికలయ్యాయి. కశ్మీర్‌ నుంచి సరఫరా అయిన ఆపిల్‌ పళ్లపై భారత వ్యతిరేక సందేశాలు రాసి వున్న ఘటన హరియాణలోని సిర్సా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌ అనే వ్యక్తి స్థానిక మార్కెట్‌ నుంచి ఆపిల్‌ పళ్లను కొనుగోలు చేసి ఇంటికి వచ్చి ఆ డబ్బాను తెరిచి చూసేసరికి, ఆ ఆపిల్స్ పై నల్లసిరాతో ఆంగ్లంలో కొన్ని పదాలు రాసి ఉన్నాయి. పరిశీలించి చూడగా అవి భారత్‌ కు వ్యతిరేకంగా రాసిన వ్యాఖ్యలుగా కనిపించాయి. అయితే ఆ వ్యక్తి వెంటనే స్థానిక పోలీసులకు విషయం తెలియజేశాడు.

కశ్మీర్‌నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే మార్గంలోని వారే ఈ పనిచేసి ఉంటారా లేక కశ్మీర్‌ నుంచి ఎగుమతి చేసేముందే ఈ నినాదాలను రాసి ఉంటారా అనే దిశగా విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే పావురాలు, గాలి బుడగల ద్వారా వచ్చిన సందేశాలు చర్చనీయాంశం కావడంతోనో ఏమో మరోసారి ఈ పనికి పూనుకున్న వారు ఈ సారి ఆపిల్స్ ని ఆశ్రయించారు. అయితే ఈ విషయమై దర్యాప్తు మొదలుపెడుతున్నట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ గుర్‌దయాళ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఇలాంటి చిల్లర పనులే పాక్ మానసిక స్థితిని, వారి ధైర్యంలో ఉన్న డొల్లతనాన్ని చెప్పకనే చెబుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News