అంతర్ రాష్ట్ర బస్సు ప్రయాణాలు ఇప్పట్లో లేనట్టేనా!

Update: 2020-06-08 17:30 GMT
వైరస్ కట్టడి కోసం అమలు చేసిన లాక్ డౌన్ వల్ల ప్రజారవాణా పూర్తిగా స్తంభించిన సంగతి తెలిసిందే. అయితే , ఆ తరువాత లాక్ డౌన్ నుండి ప్రజా రవాణాకు కేంద్రం సడలింపులు ఇచ్చింది. వైరస్ సోకకుండా నియమాలు పాటిస్తూ ప్రయాణాలు చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే, కేంద్రం లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చిన తరువాత దేశవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపులు ఒకవైపు అమలు చేస్తూనే ..మరోవైపు కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రజా రవాణా వంటి విషయాల్లో మాత్రం ఎక్కడా వెనక్కితగ్గడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బస్సులు పరిమితంగా నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఇతర రాష్ట్రాలకు మాత్రం నడిపే పరిస్దితి కనిపించడం లేదు. ఏపీ నుంచి మీ రాష్ట్రాలకు బస్సులు నడపుతామని ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశా నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో మరికొన్ని రోజులు వేచి చూసే ఆలోచనలో ఏపీ రవాణాశాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం రాష్ట్రాల మధ్య ప్రజా రవాణాకు అనుమతించింది. కేంద్రం సడలించినా స్ధానిక పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి.

కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రస్తుతం ప్రజా రవాణాను ఇతర రాష్ట్రాలకు అనుమతించే విషయంలో రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ రోజు  నుంచి గుళ్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు మరికొన్ని రోజులు వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ - కర్నాటక - తమిళనాడు ఒడిశా వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్ధితి. ఇలాంటి నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సులను తిప్పితే పరిస్ధితి చేజారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. దీనితో ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకో లేకపోతున్నాయి.
Tags:    

Similar News