కేసీఆర్ కు షాకిచ్చిన ఏపీ ఆర్టీసీ

Update: 2019-10-29 11:33 GMT
25 రోజులుగా డిమాండ్ల సాధనకు తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆవేదనను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఏపీలో వలే తెలంగాణలో కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా 26 డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు సమ్మె చేస్తున్నారు.

అయితే తెలంగాణలో ఇప్పటికే అన్ని వర్గాలు టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వగా.. తాజాగా పక్క రాష్ట్రం ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నుంచి కూడా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతు దక్కడం విశేషం.

మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ ఆర్టీసీ కార్మికులను కలిసి సమ్మెకు మద్దతు తెలిపారు. వెంటనే డిమాండ్లను నెరవేర్చాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని ఏపీ ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డి కోరారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నష్టం ఏంటని ప్రశ్నించారు.

ఏపీ తెలంగాణ విడిపోయినా అన్నదమ్ములమేనని.. ఆర్టీసీ ఆస్తులు - రూట్ ల పంపకాలు ఇంకా జరగలేదని ఏపీ ఆర్టీసీ నేతలు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు.

తెలంగాణ ఆర్టీసీకి పక్కరాష్ట్ర ఆర్టీసీ నేతల నుంచి కూడా మద్దతు దక్కడం విశేషంగా మారింది. పక్కరాష్ట్రం  నుంచి వచ్చి మరీ కేసీఆర్ తీరును ఎండగడుతున్న వైనం మాత్రం కేసీఆర్ సర్కారును ఇరుకునపెడుతోంది.
   

Tags:    

Similar News