ఒక్క నియోజకవర్గంలో తంబీలు పెట్టిన ఖర్చు రికార్డు?

Update: 2016-05-29 04:46 GMT
ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో నేతలు ఎంత ఖర్చు చేస్తారు? అన్న ప్రశ్నకు టకీమని సమాధానం చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ.. అలాంటి వారు సైతం కంగుతినే సమాచారం తాజాగా బయటకు వచ్చింది. ఇటీవల తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం.. ఎన్నికలకు ముందు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల్ని ఎన్నికల సంఘం రద్దు చేయటం తెలిసిందే. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారగా.. తాజాగా ఈ రెండు నియోజకవర్గాల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న వ్యాఖ్యలు వింటున్న వారు విస్మయానికి గురయ్యే పరిస్థితి.

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిసి.. తంజావూరు నియోజకవర్గాలకు సంబంధించిన ఖర్చు విషయంపై ఎన్నికల సంఘం చెబుతున్న లెక్కలు షాకింగ్ గా మారాయి. తంజావూరును పక్కన పెట్టి.. ఒక్క అరవకురిసి నియోజకవర్గంలో బరిలోకి దిగిన అన్నాడీఎంకే.. డీఎంకే అభ్యర్థుల ఖర్చు ఏకంగా రూ.150కోట్లు దాటినట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఇంత భారీ ధనం ఖర్చు కావటం రికార్డుగా చెబుతున్నారు.

ఈ ఎన్నిక సందర్భంగా అన్నాడీఎంకే అభ్యర్థి వద్ద నుంచి నాలుగున్నరకోట్ల మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా.. డీఎంకే అభ్యర్థి నుంచి రూ.2కోట్లను పట్టుకున్నారు. ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గంలో రెండు లక్షల ధోతీలు పంచిపెట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. అంతేకాదు..అన్నాడీఎంకే అభ్యర్థి ఏకంగా రూ.59కోట్లు ఖర్చు చేస్తే.. డీఎంకే అభ్యర్థి రూ.39 కోట్లు ఖర్చు చేశారన్న మాట వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓటర్లకు పంచెలు.. చీరల్ని పంచిన ఇరు పార్టీ అభ్యర్థులు.. తాము పంచే బహుమతుల మీద తమ పార్టీకి చెందిన గుర్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటంతో ఎన్నికల సంఘానికి అడ్డంగా దొరికిపోయినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఖర్చుకు మించిన రీతిలో తమిళనాడు రాష్ట్రంలో చేసిన ఖర్చు వెలుగులోకి రావటం చూస్తే.. భవిష్యత్తులో ఎన్నికల ఖర్చు మరెంత పెరుగుతుందో అన్న ఆందోళన కలగటం ఖాయం.
Tags:    

Similar News