క్రేజీ దెబ్బకి దద్దరిల్లిన ఢిల్లీ..అప్ ఓట్ల షేరింగ్‌ ఎంతంటే!

Update: 2020-02-11 10:45 GMT
దేశ రాజధాని ఢిల్లీని మరోసారి చీపురు ఉడ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీని సైతం ముప్పతిప్పలు  పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి, ఢిల్లీలో తన సత్తా చాటింది. సరిలేరు నాకెవ్వరూ అంటూ. అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి  ఢిల్లీ పీఠాన్ని మరోసారి చేజెక్కించుకున్నారు.పోలింగ్ తరువాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలని నిజం చేస్తూ అప్ కౌంటింగ్ మొదలైనప్పటినుండి స్పష్టమైన ఆధిక్యతని చూపిస్తుంది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అప్  సాధించిన ఓట్ల శాతం.. ఎన్నికల పండితుల్ని సైతం షాక్ ‌కు గురిచేశాయి. మొత్తం 70 స్థానాలకుగానూ 58 చోట్ల విజయాన్ని ఖాయం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా దాదాపు 54 శాతం ఓట్లు సాధించడం  విశేషం.  బీజేపీ పరిస్థితి కూడా గతంలో కంటే చూస్తే కాస్త మెరుగుపడింది.

ఆమ్ ఆద్మీ పార్టీతో హోరాహోరీగా తలపడ్డ బీజేపీ కేవలం 12 సీట్లకే పరిమితమైనప్పటికీ ఓట్ల పరంగా చెప్పుకోదగ్గ సంఖ్య సాధించింది. ఢిల్లీలోని 70 స్థానాల్లో కలిపి బీజేపీకి దాదాపు 40 శాతం ఓట్లు దక్కాయి. లోక్ సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఇది తక్కువే. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా డజనుకుపైగా పార్టీలు పోటీ చేసినప్పటికీ.. అప్ , బీజేపీ మద్యే ప్రధాన పోటీ నడిచింది. ఢిల్లీలో పోలైన ఓట్లలో ఆ రెండు పార్టీలకే దాదాపు 94 శాతం ఓట్లు పడ్డాయి అంటేనే పోటీ ఏ రేంజ్ లో ఉందొ అర్థమౌతుంది.  

కాగా , ఏడు నెలల కిందట జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడా పార్టీ రికార్డు స్థాయిలో 56.58శాతం ఓట్లు సాధించింది. అదే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని ఆప్ కేవలం 18 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. కానీ , తాజాగా  వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో కేజ్రీవాల్ మరోసారి తన మ్యాజిక్ చూపిస్తూ 54 శాతం ఓట్లు సాధించగా... బీజేపీ 40 శాతం ఓట్లకే పరిమితమైపోయింది.
Tags:    

Similar News