తెలుగు రాష్ట్రాల సీఎంలు టెన్షన్ పుట్టిస్తున్నారుగా?

Update: 2022-01-16 06:02 GMT
పండుగ పూట ఎంజాయ్ చేయాలా? మరో రోజులో స్కూల్ ఉంటుందా?కాలేజీ ఉంటుందా? హాస్టల్ కు వెళ్లాలా? వద్దా? లాంటి ఆలోచనలతో అటు పిల్లలు.. ఇటు తల్లిదండ్రులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. మామూలు రోజుల్లో అయితే ఫర్లేదు. కరోనా మూడో వేవ్ వేళ.. ఏం జరగనుంది? అన్నది ప్రశ్నగా మారింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు తగ్గట్లే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే.. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకొని.. రాష్ట్రాల ఆదాయం పెరుగుతున్న వేళ.. మూడో వేవ్ పేరుతో ఆంక్షల్ని విధించినా... లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నా జరిగే నష్టం తెలిసిందే. అందుకే.. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలకు వెళుతున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంక్షల విధింపునకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి మాత్రం.. ఇప్పటికే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంక్రాంతి సెలవులు 16 తారీఖుతో (ఆదివారం) ముగియనున్నాయి. 17 నుంచి స్కూళ్లు.. కాలేజీలు ఓపెన్ కావాల్సి ఉంది. ఓ పక్క కేసులు పెరగటం.. మరోవైపు ఇప్పటికే పిల్లల చదువులు బాగా దెబ్బతిన్న నేపథ్యంలో..ర్యాంకులు.. మార్కుల కోసం తపించే తల్లిదండ్రులు ఏది ఏమైనా పిల్లల్ని స్కూళ్లకు..కాలేజీకి పంపాలని డిసైడ్ అవుతున్నారు. అయితే.. విద్యార్థులు మాత్రం స్కూళ్లకు.. కాలేజీలకు వెళ్లే కన్నా ఇంట్లో నుంచి చదువుకోవటానికే మొగ్గు చూపుతున్నారు.

తల్లిదండ్రులు మాత్రం కొందరు కాలేజీలు తెరిస్తే బాగుంటుందని చెబుతుంటే.. మరికొందరు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవరి నెలాఖరు వరకు సెలవుల్ని ప్రకటించి..ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహిస్తే బాగుంటుందని చెబుతున్నారు. విద్యా సంస్థలు మాత్రం స్కూళ్లను.. కాలేజీలను తెరవాలన్నయోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే..కాలేజీలు.. స్కూళ్లు తెరిచిన తర్వాత కేసులసంఖ్య పెరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు సరైన సమాధానం ఎవరి వద్దా లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో జనవరి నెలాఖరు వరకు స్కూళ్లకు.. కాలేజీలకు సెలవులు ఇచ్చేసి.. ఆన్ లైన్ లో విద్యా బోధన జరిగేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. శనివారం రాత్రి వరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నది లేదు.

సంక్రాంతి పండగ సెలవుల్ని  ఎంజాయ్ చేసే కన్నా.. స్కూలు..కాలేజీకి వెళతామా? లేదా? అన్న టెన్షన్ లోనే పండుగ జరిగిందని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందిని ప్రభావితం చేసే నిర్ణయాన్నికాస్త ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటేబాగుండేదని చెబుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం20 తారీఖు వరకు ప్రస్తుతం ఉన్న సెలవుల్ని పొడిగించి.. ఆ తర్వాతి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారనిచెబుతున్నారు. కానీ.. ప్రభుత్వాల నుంచి మాత్రం ఈ దిశగా  ప్రకటన మాత్రం రాకపోవటం గమనార్హం.
Tags:    

Similar News