ఈటల రాజీనామాకు నియోజకవర్గ ప్రజలు సంతోషపడుతున్నారా?

Update: 2021-06-10 05:10 GMT
సుదీర్ఘ కాలం ప్రయాణం చేసినప్పుడు.. తన తోటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయన్నది ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో దశాబ్దాల తరబడి ఉన్న బంధం.. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి.. ఎత్తుగడులు ఏ తీరులో ఉంటాయన్నది ఈటలకు బాగా తెలుసు. ఏ సమయంలో పెద్దసారు ఎలా స్పందిస్తారు? ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తారన్న విషయాలు ఆయనకు తెలియనివి కావు. తనను టార్గెట్ చేసిన వేళ.. తనకు ఎదురయ్యే పరిస్థితుల్ని ముందే ఊహిస్తున్న ఈటల.. తనదైన శైలిలో కేసీఆర్ ను ఎటకారం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తుండటంతో నియోజికవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న వ్యాఖ్య చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. అదేంటి? ఈటల రాజీనామాకు ప్రజల సంతోషానికి లింకేమిటన్న విషయాన్ని ఆయన వివరిస్తూ.. త్వరలో ఉప ఎన్నిక వచ్చిన వేళ.. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుస్తారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

భర్తల్ని కోల్పోయిన మహిళలకు ఫించన్లు.. కొత్త రేషన్ కార్డుల మంజూరు.. నిరుద్యోగ భ్రతి లాంటి ఎన్నో హామీలు ఈ రోజుకు అమలు కాలేదని.. ఉప ఎన్నిక నేపథ్యంలో అవన్నీ తీరే అవకాశం వచ్చిందని పేర్కొనటం గమనార్హం. ఏదైనా నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందంటే చాలు.. దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపటంతో పాటు.. అక్కడి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకోవటం.. సదరు నియోజకవర్గాన్ని ప్రత్యేక వరాలు ఇవ్వటం తెలిసిందే.

ఈ మధ్యనే జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు.. వరాలు ఇవ్వటం గుర్తుకు తెచ్చుకుంటే ఈటల ఎటకారం ఇట్టే అర్థమైపోతుంది. మొత్తానికి రానున్న రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గం మీద కేసీఆర్ ప్రదర్శించే ప్రేమాభిమానాలన్ని కూడా ఉప ఎన్నికే కారణం తప్పించి.. మరేమీ కాదన్న విషయాన్ని ఈటల చెప్పకనే చెప్పారని చెప్పాలి.
Tags:    

Similar News