ఫార్మర్ హౌస్ కు ఈ అప్ అండ్ డౌన్ లు ఏందో కేసీఆర్?

Update: 2022-06-04 16:30 GMT
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి అడుగు తీసి అడుగు వేయాలంటే అదో పెద్ద కార్యక్రమం. ఆయన బయటకు రావటానికి కొన్ని గంటల ముందు భారీ ఎత్తున కసరత్తు జరుగుతుంది. వేలాది గంటలు ఖర్చు అయిపోతాయి. ముఖ్యమంత్రి భద్రత అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ అనబడే ఫార్మర్ హౌస్ కు ఆయన వెళ్లి రావటం కోసం ఎంతటి ప్రయాస అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు.

సీఎం కేసీఆర్ వరకు కారు ఎక్కి కూర్చోవటం.. గమ్యస్థానం వచ్చిన తర్వాత కారు దిగటమే ఉంటుంది కానీ.. ఇందుకోసం భారీగా ప్రజాధనం ఖర్చు అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రగతిభవన్ మొదలుకొని ఎర్రవెల్లి వరకు వందలాది మంది పోలీసులు భద్రత ఏర్పాట్లలో తలమునకలై ఉంటారు.

ముఖ్యమంత్రి అన్న తర్వాత ఆ మాత్రం ఉండాల్సిందే. అదేం తప్పు కాదు. కానీ.. ఒక్క రాత్రి కోసం ఫార్మర్ హౌస్ కు సీఎం కేసీఆర్ వెళ్లటంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రావటానికి అయిన ఖర్చు చూస్తే.. అదే కోట్లాది రూపాయిలు ఉంటుందని చెప్పక తప్పదు.

మే 31న ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయన.. ఒకటి.. రెండు తేదీల్లో హైదరాబాద్ లో ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మళ్లీ మూడో తేదీ అంటే శుక్రవారం సాయంత్రం ఆయన ప్రగతిభవన్ నుంచి బయలుదేరి .. రాత్రి సమయానికి ఎర్రవల్లికి చేరుకున్నారు. ఇక్కడ అభ్యంతరం వ్యక్తమవుతోంది ఎక్కడంటే.. శనివారం ఆయన ఉదయాన్నే బయలుదేరి మళ్లీ ప్రగతి భవన్ కు వెళుతున్నారు. అంటే.. కేవలం ఒక్క రాత్రి కోసం ఆయన ప్రయాస పడటమే కాదు.. ఆయన కారణంగా వందలాది మంది భద్రతా సిబ్బంది సైతం కష్టపడాల్సి ఉంటుంది.

ఈ రోజు (శనివారం) వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్ కు రానున్నారు. దీనికి కారణం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులు ప్రగతి భవన్ కు రానున్నారు. వారితో చర్చలు జరిపేందుకు వీలుగా ఆయన ప్రగతిభవన్ కు వస్తున్నారు.

అంటే.. శుక్రవారం రాత్రికి ఎర్రవల్లికి చేరుకొని శనివారం ఉదయం తిరిగి ప్రగతిభవన్ కు వచ్చేందుకు అంతలా హడావుడి ఎందుకు? అదేదో ఒక రోజు ప్రగతి భవన్ లో ఉండిపోయి.. ఎంచక్కా శనివారం రాత్రి బయలుదేరి వెళితే సరిపోతుంది కదా? ఏందో ఈ అప్ అండ్ డౌన్ ట్రిప్పులు సారూ? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News