వాదనలు సమాప్తం..రవిప్రకాశ్ కు బెయిల్ వచ్చేనా?

Update: 2019-06-18 16:29 GMT
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు బెయిల్ దక్కుతుందా? లేదంటే అరెస్ట్ అవుతారా? అన్న విషయం తేలాలంటే ఇంకో రెండు వారాల పాటు ఆగాల్సిందే. అంటే రెండు వారాల పాటు రవిప్రకాశ్ ఊపిరి పీల్చుకోవచ్చన్న మాట. టీవీ 9ను అలంద మీడియా కొనుగోలు చేసిన తర్వాత... కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు రవిప్రకాశ్ యత్నించారన్న ఆరోపణలపై అలంద మీడియా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిధుల దుర్వినియోగం - ఫోర్జరీ తదితరాలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ రవిప్రకాశ్ సహా ఆయన మిత్రుడు - సినీ నటుడు శివాజీ - టీవీ 9 ఉద్యోగి మూర్తిలకు నోటీసులు జారీ చేశారు.

మూర్తి మినహా రవిప్రకాశ్ - శివాజీలు విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం యత్నించారు. ఈ క్రమంలో చుట్టూ తిరిగి మళ్లీ హైకోర్టుకే వచ్చిన రవిప్రకాశ్ తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ పై ఇటు రవిప్రకాశ్ తో పాటు పోలీసుల వాదనలను విన్న హైకోర్టు... ఈ కేసులో వాదనలు పూర్తి అయినట్టుగా మంగళవారం ప్రకటించింది. వాదనలు పూర్తి అయినట్లు ప్రకటించిన కోర్టు... తన తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది. దీంతో రవిప్రకాశ్ కు బెయిల్ దక్కుతుందా? అరెస్టై జైల్లో కూర్చుంటారా? అనేది తేలాలంటే... ఇంకా రెండు వారాల పాటు వెయిట్ చేయాల్సిందేనన్న మాట.

ఇక ఇరువర్గాల వాదనల విషయానికి వస్తే... రవిప్రకాశ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన తరఫున న్యాయవాది వాదించారు. రవిప్రకాశ్ - శివాజీల మధ్య షేర్ల బదిలీ పారదర్శకంగానే జరిగిందని తెలిపారు. ఫోర్జరీ ఆరోపణలు అవాస్తవమేనని పేర్కొన్నారు. అయితే బెయిల్ ఇస్తే.. కేసు విచారణను రవిప్రకాశ్ ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరఫు లాయర్ వాదించారు.

Tags:    

Similar News