ఏడులో రెండు అంశాలే వ్యతిరేకంగా ఉన్నాయంటే..?

Update: 2015-06-27 05:30 GMT
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్‌ విషయంపై హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఇరు పక్షాల వాదనలు ముగిసిన అనంతరం నిర్ణయాన్ని మంగళవారం నాటికి వాయిదా వేశారు.

బెయిల్‌ కోసం ఇరు పక్షాల వారు హోరాహోరీగా వాదనలు చేసుకున్న ఈ కేసులో న్యాయమూర్తి రాజాఇళంగో కొన్ని కీలకవ్యాఖ్యలు చేశారు. ఏసీబీ చెప్పిన ఏడు అంశాల్లో రెండు మాత్రమే బెయిల్‌ ఇవ్వటానికి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు.

కేసు తీవ్రమైనదన్న ఏసీబీ వ్యాఖ్యతో పాటు.. ఈ  కేసు ప్రాధమికంగా ఉందన్న రెండు అంశాలు అనుకూలంగా ఉన్నాయని.. మరో ఐదు అంశాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న వ్యాఖ్య చేశారు. ఇన్ని మాటలు చెప్పినప్పుడు.. బెయిల్‌కు కోర్టు సానుకూలంగా స్పందిస్తుందన్న భావన కలిగింది. అయితే.. కోర్టు నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేసి విచారణను ముగించారు.

బెయిల్‌ ఇవ్వాలంటూ సీనియర్‌ న్యాయవాది సిద్థార్థ్‌ లూత్రా బలంగా తన వాదనలు వినిపించగా.. ఏజీ రామకృష్ణారెడ్డి సైతం బలంగా తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. బెయిల్‌ ఇవ్వటం ఏ మాత్రం సరికాదన్న వాదనను ఆయన వినిపించారు. శుక్రవారం నాటి బెయిల్‌పై జరిగిన వాదోపవాదాలు విన్న న్యాయవాద వర్గాల అభిప్రాయంలో రేవంత్‌కు బెయిల్‌ రావటం కాస్త కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది.

ఏసీబీ ప్రస్తావించిన ఏడు విషయాల్లో రెండు విషయాలు మాత్రమే బెయిల్‌ ఇవ్వకపోవటానికి సముచితమైన కారణాలుగా చెబుతున్నప్పటికీ.. ఆ రెండు కారణాలు అత్యంత కీలకమైనవి కావటంతో బెయిల్‌ విషయంలో రేవంత్‌కు సంతృప్తి కలిగే పరిస్థితి ఉండదన్న వాదన వ్యక్తమవుతోంది.

అయితే.. ఈ వాదనకు కొందరు విభేదిస్తున్నారు. మొత్తం ఏడు అంశాల్లో ఐదు అంశాలు బెయిల్‌ ఇవ్వదగినట్లుగా ఉన్నవన్న విషయాన్ని న్యాయమూర్తి వ్యాఖ్యానించి.. తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేయటం చూసినప్పుడు.. తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకుంటే రేవంత్‌ బెయిల్‌ విషయంలో ప్రతికూల వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉండొచ్చన్న మాటను చెబుతున్నారు.

సున్నితమైన.. వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న అంశాలకు సంబంధించి బెయిల్‌ లాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో న్యాయమూర్తులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగానే.. బెయిల్‌పై నిర్ణయానికి మంగళవారం వరకూ వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News