పార్లమెంటు ఓకే చెబితే.. పీవోకే తెచ్చేస్తానంటూ సంచలనం

Update: 2020-01-12 03:24 GMT
భారత ఆర్మీ చీఫ్ అనే వారు బహిరంగంగా బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేయటం.. ఊహించని రీతిలో మాట్లాడటం లాంటివి మోడీ హయాంలోనే చూస్తున్నామని చెప్పక తప్పదు. గతంలోనూ ఆర్మీ చీఫ్ లు ఉండేవారు. వారి నోటి వెంట ఒక్క మాట అంటే ఒక్కటి వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా.. ముఖ్యమైన రోజుల్లో వెలువరించే సందేశాలు తప్పించి.. కీలక అంశాలకు సంబంధించి మరెలాంటి వ్యాఖ్యలు చేసే వారు కాదు. అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత త్రివిధ దళాలకు చెందిన ముఖ్యులు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్ గా మారటం ఈ మధ్యన ఎక్కువైంది.

తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే. పాక్ ఆక్రమిత కశ్మీర్ పై దేశ ప్రజల మనసుల్లో ఉన్న విషయాన్ని ఆయన తన మాటలతో చెప్పేశారు. పీవోకే భారత్ దే అన్న విషయంలో భారతీయుల్లో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. కాకుంటే.. ఆ విషయాన్ని ప్రభుత్వం సూటిగా చెప్పేయటం.. గతంలో జరగలేదు. కానీ.. మోడీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా సూటిగా చెప్పటమే కాదు.. ఆ అంశం మీద ఇటీవల కాలంలో పలు హెచ్చరికలు కూడా చేసింది.

తాజాగా అదే విషయాన్ని ప్రస్తావించిన నరవాణే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని పార్లమెంటు ఎప్పుడో తీర్మానం చేసిందని.. మళ్లీ మన స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేస్తే..కచ్ఛితంగా ఆ విషయం మీద తాము చర్యలు చేపడతామని చెప్పి సంచలనంగా మారారు. ఇలాంటి వ్యాఖ్యలు అధికార పార్టీకి చెందిన వారి నోటి నుంచి వస్తే ఓకే. కానీ.. ఆర్మీ చీఫ్ నోటి నుంచి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పీవోకేను చేజార్చుకోవటంపై.. పాక్ అక్రమణలో ఉండటంపైన ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోతుంటాడు. నా తల్లి నుదిట సింధూరం కశ్మీర్ అని గొప్పగా చెప్పుకునే వారు.. అదే కశ్మీరానికి చెందిన కొంత భాగం దాయాది చేతిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతుంటారు. అలాంటి వేదనకు పుల్ స్టాప్ పెట్టేలా పీవోకే విషయంలో మోడీ సర్కారు ఓపెన్ గా చెప్పేయటం ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో త్రివిధ దళాలకు చెందిన ముఖ్యులు సైతం ఇదే విషయాన్ని చెప్పటాన్ని చూస్తే.. రానున్న రోజుల్లో భారతీయుల ఆశలు.. ఆకాంక్షలు నిజం కానున్నాయా? అన్న భావన కలుగక మానదు.

ఇంతకీ ఈ వ్యాఖ్యలు నరవాణే ఎక్కడ? ఎప్పుడు? ఏ సందర్భంలో చెప్పారన్న విసయాన్ని చూస్తే.. ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. 13 లక్షల మంది ఉన్న ఆర్మీ.. రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటుందన్న ఆయన.. పీఠికలోని విషయాలకు లోబడి ఉంటుందన్నారు. త్రివిధ దళాలన్నింటినీ సమన్వయ పరిచేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను ఏర్పాటు చేయటాన్ని విపరీతంగా పొగిడేసిన నరవాణే మాటల్ని చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏం జరగనుందన్న విషయాన్ని చూచాయగా చెప్పేశారా? అన్న భావన కలుగక మానదు.


Tags:    

Similar News