వేత‌న జీవుల‌కు జైట్లీ ఇచ్చిన వ‌ర‌మిదే!

Update: 2017-02-01 08:16 GMT
ఆదాయ‌ప‌న్ను వ‌సూళ్ల‌లో భారీ మార్పులు రానున్న‌ట్లు చాలా రోజులుగా వినిపిస్తున్న వార్త‌ల‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిజం చేసేశారు. ఆర్థిక వేత్త‌ల అంచ‌నాల‌కు మించి జైట్లీ వేత‌న జీవుల‌కు వ‌రాలు ప్ర‌క‌టించేశారు. ప్ర‌స్తుతం ఆమ‌ల్లో ఉన్న ఆదాయ‌ప‌న్ను ప్ర‌కారం... రూ.2.5 ల‌క్ష‌ల ఆదాపై ప‌ది శాతం మేర ప‌న్ను క‌ట్టాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ద‌ఫా బ‌డ్జెట్లో జైట్లీ దీనిని స‌మూలంగా మార్చేశారు. రూ.3 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న వారు అస‌లు ప‌న్ను క‌ట్టాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని జైట్లీ  ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా... క‌నీస ప‌న్నును కూడా స‌గానికి స‌గం త‌గ్గించేసిన జైట్లీ... ప్ర‌స్తుతం ఉన్న 10 శాతానికి బ‌దులుగా 5 శాతానికి దానిని త‌గ్గిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. దీనిని రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల ఆదాయం మ‌ధ్య ఉన్న వారికి వ‌ర్తింపజేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక రూ.5 ల‌క్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఏకంగా స‌గం మేర దాచుకునేందుకు కూడా జైట్లీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఇక ఆపై ఆదాయం క‌లిగిన వారికి కూడా జైట్లీ ప‌న్ను మిన‌హాయింపుల‌ను భారీగానే ప్ర‌క‌టించారు. రూ.10ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్ష‌ల వార్షికాదాయం ఉన్న వారిపై స‌ర్‌చార్జీని 10 శాతంగా ప్ర‌క‌టించిన జైట్లీ... వార్షికాదాయం రూ.1 కోటి దాటితే 15 శాతం మేర స‌ర్ చార్జీ విధిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత న‌ల్ల ధ‌నానికి చెక్ ప‌డింద‌ని, ల‌క్ష‌లాది కోట్ల మేర న‌ల్ల‌ధ‌నం ప్ర‌భుత్వం ద‌రికి చేరింద‌న్న వాద‌న వినిపించింది. ఇలా చేరిన నిధుల‌తో పేద‌,  మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మోదీ స‌ర్కారు భారీ న‌జ‌రానాల‌ను ప్ర‌క‌టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగిన మాట విదిత‌మే. ఇదే కోవ‌లో ఆలోచించిన జైట్లీ స్వ‌ల్పాదాయ వ‌ర్గాల‌కు భారీగానే వ‌రాలు ప్ర‌క‌టించారు. ప‌న్ను ప‌రిధిలోకి మరింత మందిని తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌న్ను మిన‌హాయింపుల‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు కూడా జైట్లీ ప్ర‌క‌టించారు. తాజా ప‌న్ను మిన‌హాయింపుల ద్వారా వేత‌న జీవుల‌కు ఏ మేర ల‌బ్ధి చేకూరుతుంద‌న్న విష‌యంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్న‌ప్ప‌టికీ... ఎంతో కొంత మేర ల‌బ్ధి మాత్రం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News