రూ.2వేల నోటులో చిప్ మాటలన్నీ ఉత్తవే

Update: 2016-11-09 15:45 GMT
గడిచిన కొద్దిరోజులుగా రూ.2వేల నోటు మీద వస్తున్న వార్తలు అన్నీఇన్నీ కావు. సదరు నోటు లోపల నానో చిప్ ఒకటి అమర్చారని.. దీంతో భూగర్భంలో నోట్లను దాచి పెట్టినా.. దాని ఆచూకీ దానంతట అదే చెప్పేస్తుందని.. అక్రమార్కులు పీచమణిచేలా చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చే రూ.2వేల నోట్ల గురించి సోషల్ మీడియాలో సాగిన ప్రచారంతో చివరకు ఆ నోట్లను ఉంచుకునే కన్నా.. వాటిని టచ్ చేయకుండా ఉండటమే బెటర్ అన్న భావన కలిగేలా చేసిందనటంలో సందేహం లేదు.

రూ.2వేల నోటు మీద నడుస్తున్న చర్చలో ఏ మాత్రం వాస్తవం లేదని.. అందులో నానో చిప్ ఉన్న మాటలో వాస్తవం లేదని తేల్చేశారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. రూ.2వేల నోటు గురించి చెబుతూ.. ఈ నోటులో చిప్ ఉందంటూ ఎవరూ ప్రచారం మొదలు పెట్టారో తనకు అర్థం కావటం లేదని.. అసలు అలాంటి టెక్నాలజీ ఏమీ కొత్త నోటులో ఉండదని తేల్చేశారు.

పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ విశ్వసనీయత మరింత పెరుగుతుందని.. పెద్ద నోట్లను మార్చుకునేందుకు వీలుగా బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయటం వరకూ ఓకేకానీ.. అదనపు సమయంపై బ్యాంకర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైట్లీ స్పష్టం చేశారు. జీఎస్టీ అమలు తర్వాత ఎవరు ఎక్కడ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నడిపినా ఇట్టే బయటపడిపోతుందని.. దాగినా దాగే పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. నిజాయితీగా ఖర్చు పెట్టే వారు సంతోషంగా జీవిస్తారని.. వారికి ఎలాంటి కష్టాలు ఉండవని ఆయన చెప్పారు. న్యాయబద్ధ సంపాదనను బ్యాంకుల్లో వేస్తే ఇబ్బంది ఉండదని.. రూ.10లక్షలు రేపొద్దున బ్యాంకులో వేసి.. రెండు రోజుల తర్వాత చెక్ ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా.. రూ.2వేల నోటులో నానో చిప్ లేదన్న విషయం ఇప్పుడు అందరిని మరోసారి ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News