జైట్లీ నోట.. భారీ మూల్యం మాట వచ్చేసింది

Update: 2016-11-03 05:50 GMT
భారత్ – పాక్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిస్థాయిలో దిగజారిన దుస్థితి. భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో అవమానభారంతో రగిలిపోతున్న పాకిస్థాన్ అందుకు ప్రతిగా ఏదో చేయాలని తపిస్తోంది. మూర్ఖత్వంతో వ్యవహరిస్తూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశ సర్కారు పుణ్యమా అని పాకిస్థానీలు ఇప్పటికే ఎన్నో విషాదాల్ని చవిచూడాల్సి వచ్చింది.

దేశంలో పగడ విప్పి సొంత ప్రజల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదుల పీచ మణిచే ప్రోగ్రాంను పక్కన పెట్టేసి.. భారత్ మీద కవ్వింపు కాల్పులకు తెగ బడుతున్న పాకిస్థాన్ తీరు చూస్తే.. సొంత ప్రజల ప్రాణాలు సైతం ఆ దేశ పాలకులకు పెద్దగా పట్టింపు లేదన్న భావన కలగకమానదు. ఇదిలా ఉండగా.. తాజాగా సరిహద్దు వెంట కాల్పుల బరి తెగింపునకు పాల్పడిన పాకిస్థాన్ కారణంగా ఎనిమిది మంది భారతీయ పౌరులు ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఈ తాజా పరిణామంపై భారత ప్రభుత్వంతో సహా.. దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా భారత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నోటి నుంచి తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఇంత విస్పష్టంగా పాక్ పై విరుచుకుపడిన నేత లేడనే చెప్పాలి.

భారత్ ఇప్పటివరకూ పాటించిన నిగ్రహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొందని.. పాక్ వ్యవహారశైలి మాత్రం ఇదే రీతిలో సాగితే మాత్రం అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయ‌న‌ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ పై జైట్లీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూస్తే.. పాక్ తీరుపై కేంద్రం ఎంత సీరియస్ గా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.

ఉగ్రవాదుల్ని భారత్ లోకి పంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని.. భారత్ పాటించిన నిగ్రహం కారణంగా ఇప్పటికే చాలా నష్టం వాటిల్లిందని.. కానీ కాలం మారిందని.. భారత ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించనున్నదని స్పష్టం చేశారు. భారత్ పైకి ఉగ్రవాదుల్ని ఎగదోస్తూ సరిహద్దుల వెంట పౌరుల ప్రాణాలు తీస్తున్నందుకు పాకిస్థాన్ భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని జైట్లీ స్పష్టం చేయటం గమనార్హం. మరి.. పాకిస్థాన్ ఏ విధంగా నష్టపోనుందన్న విషయాన్ని జైట్లీ చెప్పనప్పటికీ.. ఇంత సూటిగా ఆ స్థాయి మాటల రావటం చూస్తే.. పాక్ తీరుపై మోడీ సర్కారు రానున్న రోజుల్లో మరింత కఠిన వైఖరిని అనుసరించే అవకాశం ఉందన్న విషయం స్పష్టమైనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News