బంగారం మీద జైట్లీ భారీ హామీ

Update: 2016-12-01 15:59 GMT
‘‘నల్లధనం మీద గురి పెట్టిన మోడీ.. తర్వాత మీ ఇంట్లో బంగారం మీద కూడా కన్నేస్తాడు. మీ ఇంట్లో బంగారం లెక్క చెప్పమంటారు’’ అంటూ సాగుతున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. బంగారం పేరుతో టార్గెట్ చేయటానికి ప్రధాని మోడీ సిద్ధమయ్యారంటూ కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ క్లారిటీ ఇచ్చేశారు.

ఇళ్లల్లో ఉండే బంగారం లెక్క చెప్పాలని.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలకు సంబంధించిన రశీదులు చూపించాలంటూ ప్రభుత్వం త్వరలో రూల్ తెస్తారంటూ సాగుతున్న ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాతల నాటి నుంచి వచ్చే బంగారు ఆభరణాలతో పాటు.. పెళ్లి సమయంలో చేయించే బంగారానికి సంబంధించిన రశీదులు ఎందుకుంటాయంటూ ఆవేదన చెందుతున్న వారివన్న అనవసర భయాలే తప్పించి మరింకేమీ కాదన్న విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చేశారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ బంగారం మీద సాగుతున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని చెప్పటమే కాదు.. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంమీద మాత్రమే పన్ను విధిస్తామని చెప్పారు. పెళ్లి అయిన మహిళ వద్ద 500 గ్రాముల బంగారం.. పెళ్లి కాని అమ్మాయి వద్ద 250 గ్రాముల బంగారం.. పురుషుల వద్ద 100గ్రాముల బంగారం ఉండొచ్చని చెప్పారు. వారసత్వంగా వచ్చిన.. ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారం మీద ఎలాంటి పన్ను ఉండదని స్పష్టం చేశారు. లెక్క చూపించిన పన్ను ఆదాయంతో కొన్న బంగారంతో ఎలాంటి ఇబ్బంది లేదని.. బంగారు నగల మీద కొత్తగా ఎలాంటి నిబంధనలు విధించలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల చేసిన  చట్టసవరణ బిల్లులో బంగారానికి సంబందించిన ఆంక్షలు ఏమీ లేవన్న మాటను ఆయన చెప్పారు. నగల జఫ్తుపై ఎలాంటి కొత్త నిబంధనలు లేవని.. ఇవన్నీ గతంలో ఉన్నవే తప్పించి కొత్తగా ఏమీ లేవన్నారు. పరిమితికి మించి ఉన్న ఆభరణాలపై మాత్రమేఅధికారులు ప్రశ్నలు వేస్తారని క్లారిటీ ఇచ్చిన జైట్లీ మాటలతో అయినా.. బంగారం మీద బోలెడన్ని డౌట్లు పెట్టుకున్న వారంతా తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News