ఆయన మాత్రం బుకాయించడం మానలేదు!

Update: 2018-01-03 04:38 GMT
సాక్షాత్తూ సభాపతి స్థానంలో కూర్చుని ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... ‘‘ఇన్నాళ్లూ దీని గురించి ప్రచారంలో ఉన్న భయాల గురించి.. కేంద్ర మంత్రి సరైన వివరణ ఇచ్చి సందేహాలను తొలగించారు’’ అని కితాబులు ఇచ్చి ఉండవచ్చు గాక.. కానీ వాస్తవానికి దేశవ్యాప్తంగా ప్రజలను - మధ్యతరగతి ప్రజలను విపరీతమైన ఆందోళనకు గురిచేస్తున్న ఎఫ్ ఆర్‌ డీఐ బిల్లు విషయంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికీ బుకాయిస్తూనే ఉన్నారు. ప్రజలు అసలు భయాలు ఏమైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి బదులుగా ఆ భయాలు మరింత శృతి మించేలా ఆయన అర్థ సత్యాలను ప్రచారం చేస్తూ.. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు.

ఎఫ్ ఆర్‌ డీఐ బిల్లు విషయంలో.. బెయిల్ ఇన్ అంశం గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు రేగుతున్నసంగతి అందరికీ తెలిసిందే. ప్రెవేటు బ్యాంకులు దివాళా తీసిన  నేపథ్యంలో వాటి చెల్లింపులు చేయడానికి బ్యాంకులో ఉన్న డిపాజిట్లనే ఆస్తులుగా పరిగణించి.. ఆ సొమ్మునే తీసుకుని.. అందులోంచే.. అందరికీ దామాషా ప్రకారంగా చెల్లింపులు జరిపే వెసులుబాటులను ఈ ఎఫ్ ఆర్‌ డీఐ బిల్లు కల్పిస్తుంది. అంటే.. లంచాలకు కక్కుర్తి పడి.. భారీ మొత్తాలు వందల కోట్లు అప్పులు ఇచ్చేసి.. వాటిని వసూలు చేసుకోవడం చేతకాక.. బ్యాంకులు  దివాళా తీసేస్తే.. సామాన్యులు పెట్టుకున్న డిపాజిట్ డబ్బులను కూడా తీసేసుకుని.. ఆ మొత్తంలోంచి నష్టపోయిన వారికి చెల్లింపులు చేసేలా ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకున్న వారికి వారి డిపాజిట్ మొత్తం ఎంత ఎక్కువగా ఉన్నా సరే.. కేవలం లక్ష మాత్రం తిరిగి ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని నష్టనివారణకు వాడేలా ఈ బిల్లు అనుమతిస్తుంది. అంటే డిపాజిటర్లు దాచుకున్న సొంత సొమ్మును కూడా కాజేస్తారన్నమాట. ఈ అంశంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి.

దీనిపై జైట్లీ సభలో వివరణ ఇస్తూ.. బెయిల్ ఇన్ అనేది కేవలం ఒక అంశం మాత్రమే అని.. బ్యాంకులు దివాళా తీసినప్పుడు చెల్లింపులకు ఉన్న అనేక మార్గాల్లో ఇదొకటి అని మాత్రమే చెబుతున్నారు. ఇది కూడా బుకాయింపే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. మిగిలిన మార్గాలు పేరుకు ఉన్నప్పటికీ.. అవేవీ ఆచరణ సాధ్యాలు కావు. బెయిల్ ఇన్ ఒక్కటే ఆచరణలో కుదిరే పద్ధతిగా కనిపిస్తోంది. ఇప్పటికీ అరుణ్ జైట్లీ బుకాయింపు మాటలతో డిపాజిటర్లను మభ్యపెట్టి బిల్లును బలవంతంగా జనం నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారనే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జనం బాధలను పట్టించుకోకుండా, వారు సొమ్ముకు భద్రత లేకుండా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యాపిస్తున్నాయి.
Tags:    

Similar News