షాపులకు ఇక సెలవులు లేనట్లే

Update: 2016-02-29 13:24 GMT
పెద్దగా ప్రచారం జరగలేదు కానీ.. తాజా బడ్జెట్ లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పైకి సాదాసీదాగా అనిపించిన భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసే ఈ అంశం.. రానున్న రోజుల్లో పలు సామాజిక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికి ఆదివారం.. సోమవారం అన్న తేడా లేకుండా నిత్యం షాపులు తెరిచే ఉంటాయి. మిగిలిన రోజులతో పోలిస్తే.. ఆదివారం షాపులు తక్కువగా తెరిచి ఉంటాయి. మాల్స్.. పెద్ద పెద్ద షోరూమ్ ల రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆదివారాలు సెలవులు ఇవ్వటం మానేశారు. నగరాల్ని వదిలేస్తే.. ఓ మోస్తరు పట్టణాలు.. పట్టణాలు.. గ్రామాల్లో ఆదివారం షాపులు తెరవరు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. సెలవు శనివారం కానీ మరో రోజు కానీ ఉంటుంది. ఏమైనా వారానికి ఒకరోజు షాపులు బంద్ చేయటం కామన్.

ఇది మనకు తెలిసిన భారతం. తాజాగా బడ్జెట్ లో ఆర్థికమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ద్వారా.. షాపింగ్ మాల్స్ మాత్రమే కాదు.. చిన్న చిన్న షాపులు కూడా వారం రోజులూ ఎందుకు పని చేయకూడదంటూ ప్రశ్నించటమే కాదు.. ఆ దిశగా అధికారికంగా నిర్ణయం తీసేసుకున్నారు. ఇందుకు తగినట్లుగా ఇప్పటికే అమల్లో ఉన్న చట్టానికి మార్పులు చేయనున్నారు.

తాజా మార్పులతో వారంలో ఒక రోజు సెలవు అన్నది లేకుండా ఉండనుంది.కాకుంటే.. సదరు షాపుల్లో పని చేసే గుమస్తాలు.. వర్కర్లకు వారంలో వారికి తోచిన రోజును సెలవు కింద ఇవ్వనున్నారు. జైట్లీ తాజా ప్రకటనతో ఇక ఏడాది పొడుగునా షాపులు తెరిచే వెసులుబాటు కలగనుంది.
Tags:    

Similar News