సంచలన వ్యాఖ్యలతో షాకిచ్చిన జైట్లీ

Update: 2017-02-27 04:43 GMT
రాజకీయంగా ప్రత్యర్థులపై విరుచుకుపడటం రాజకీయ నాయకులకు మామూలే. అందుకు కేంద్రమంత్రులేమీ మినహాయింపు కాదు. అవసరమైనవేళలో ప్రత్యర్థుల్ని ఎంతలా ఉతికి ఆరేస్తారన్నది ప్రధాని మోడీ ఈ మధ్య కాలంలో చేస్తున్న ఎన్నికల ప్రచారంలో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఐదురాష్ట్రాల ఎన్నికల సందర్భంగా తమ రాజకీయ ప్రత్యర్థులపై మాటలతో శివాలెత్తుతున్న మోడీ తీరు చూస్తే.. ఆయనలో రెండో కోణం ఇట్టే కనిపిస్తుంది.

ఇలా ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఒకటైతే.. వేరే దేశం మీద అధికారంలో ఉన్న వారు వ్యాఖ్యలు చేయటం కాస్త తక్కువనే చెప్పాలి. ఇక.. బ్రిటన్ లాంటి అగ్రరాజ్యంపై నెగిటివ్ వ్యాఖ్యలు పెద్దగా ఉండవనే చెప్పాలి. ఇందుకు భిన్నంగా జైట్లీ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రుణ ఎగవేతదారులకు ఆశ్రయం కల్పించటంలో బ్రిటన్ ఒక వరంలా మారిందని.. దీనికి చరమగీతం పాడాలంటూ జైట్లీ వేసిన చురకలు సంచలనంగా మారాయి.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దక్షిణాసియా కేంద్రం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన జైట్లీ... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బ్రిటన్ పై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. రూ.9500 కోట్ల రుణాల్ని ఎగవేత కేసులో.. చడీ చప్పుడు కాకుండా బ్రిటన్ కు పారిపోయిన ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శల్ని మోడీ సర్కారు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ దేశం అయితే ఆశ్రయం ఇచ్చిందో.. ఆ దేశం తీరును కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న జైట్లీ పరోక్షంగా తప్పు పట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బ్యాంకుల నుంచి రుణం తీసుకొని చెల్లించకుండా ఎగవేయొచ్చన్న ఆలోచన చాలామందిలో ఉందని.. అవసరమైతే లండన్ కు పోయి తలదాచుకోవచ్చని అనుకుంటున్నారంటూ తన ఆగ్రహాన్ని జైట్లీ దాచుకోలేదు. ‘‘ఇలా పారిపోయిన వారు ఆశ్రయం పొందేందుకు బ్రిటన్ లో చాలా ఉదారమైన ప్రజాస్వామ్యం ఉంది. ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరగకుండా తొలిసారి కఠిన చర్యలు చేపట్టాం. రుణాలు ఎగ్గొట్టేసి పారిపోయినా..వారి ఆస్తుల్ని జఫ్తు చేస్తున్నాం’’ అంటూ తాము చేస్తున్న చర్యల్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

నిందితుల అప్పగింత ఒప్పందంలో భాగంగా మాల్యాను తమకు అప్పగించాలంటూ భారత సర్కారు ఇటీవల బ్రిటన్ సర్కారును కోరిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మోడీ అండ్ కోకు తెలిసే గుట్టుచప్పుడు కాకుండా మాల్యాను దేశం నుంచి తప్పించినట్లుగా వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే రీతిలో జైట్లీ వ్యాఖ్యలు ఉన్నాయి. మాల్యాను దేశానికి తిరిగి తీసుకొచ్చేలా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. మాల్యాను నిజంగానే తీసుకొస్తే.. మోడీ ఇమేజ్ మరింత పెరుగుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News