ఎయిర్ పోర్ట్ కార్పెట్‌ పై ప‌డుకున్న అరుంధ‌తీ!

Update: 2017-12-14 05:27 GMT
దేశంలో అత్యంత శ‌క్తివంతులైన మ‌హిళ‌ల జాబితాలో నిలిచిన  ఆమె.. ఒక విమాన‌యాన సంస్థ చేసిన ప‌నికి ఎయిర్ పోర్ట్ లో కార్పెట్ మీద ప‌డుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ మాజీ ఛైర్మ‌న్ గా అంద‌రికి సుప‌రిచితురాలైన అరుంధ‌తీ భ‌ట్టాచార్య  అనుకోని రీతిలో తీవ్ర క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆమెతో పాటు.. ఆ విమానంలో ఉన్న వారంద‌రిది ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు.

ఎయిర్ లైన్స్ సంస్థ నిర్ల‌క్ష్యం.. సేవ‌లు అందించే విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్ల‌కు ప్ర‌యాణికులు బ‌ల‌య్యారు. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ఎయిర్ లైన్స్ సంస్థ‌గా గొప్ప‌లు చెప్పుకునే బ్రిటీష్ ఎయిర్ లైన్స్ సేవ‌లు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ముంబ‌యి నుంచి లండ‌న్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్ వేస్‌ కు చెందిన బీఏ 198 విమానం సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు బ‌య‌లుదేరాల్సి ఉంది. అయితే.. లండ‌న్ లో విప‌రీత‌మైన మంచు కురుస్తున్న కార‌ణంగా నాలుగు గంట‌లు ఆల‌స్యంగా టేకాఫ్ అయ్యింది.

అయితే.. విమానంలోని ఫ‌స్ట్ క్లాస్ గ్యాల‌రీలో యాసిడ్ వాస‌నతో పాటు పొగ వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే విమానాన్ని అజ‌ర్ బైజాన్ రాజ‌ధాని బ‌కులో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సోమ‌వారం రాత్రి 9 గంట‌ల వేళ‌కు బ‌కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న విమానంలో ఏర్ప‌డ్డ సాంకేతిక లోపాన్ని గుర్తించి స‌రి చేశారు.

అయితే.. అప్ప‌టికే తాము 12 గంట‌ల పాటు ప‌ని చేశామ‌ని సిబ్బంది విమానాన్ని న‌డిపేందుకు నిరాక‌రించారు. అదే స‌మ‌యంలో ప్ర‌యాణికుల‌కు స‌రైన సౌక‌ర్యాలు అందించాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థ లైట్ తీసుకోవ‌టంతో ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ లోనే ప్ర‌యాణికులు విశ్ర‌మించాల్సి వ‌చ్చింది. దీంతో.. ఎయిర్ పోర్ట్ లోని కార్పెట్ మీద‌నే అరుంధ‌తీ నిద్ర పోవాల్సి వ‌చ్చింది. విమాన ప్ర‌యాణికుల్ని బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని అరుంధ‌తి వాపోయారు. ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించి ఉంటే.. ప్ర‌యాణికుల‌కు ఇంత క‌ష్టం ఎదుర‌య్యేది కాదు.
Tags:    

Similar News