ఎవరీ అరవింద్ గోయల్.. ఇప్పుడాయన హాట్ టాపిక్ ఎందుకయ్యారు?

Update: 2022-07-21 11:30 GMT
వందల కోట్ల ఆస్తి ఉండి.. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చేసి.. తన కోసం కేవలంఒక ఇంటిని మాత్రమే ఉంచుకోవటం సాధ్యమవుతుందా? ఇప్పటి రోజుల్లో డబ్బు చుట్టూనే ప్రపంచం మొత్తం తిరుగుతుందన్న భావనలో ఉండటమే కాదు.. ఎంత సంపాదించినా.. ఇంకా.. ఇంకా సంపాదించాలనే తపన తప్పించి మరేమీ కనిపించని రోజుల్లో అందుకు భిన్నంగా ఉన్న ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికిఅప్పగించే అరుదైన వ్యక్తులు ఎక్కడో కాదు.. మన దేశంలోనే ఉన్నారన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. ఇంతకీ ఆయన ఎవరో కాదు ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందిన అరవింద్ గోయల్.

విద్యావేత్తగా.. వ్యాపారవేత్తగా.. సామాజిక వేత్తగా సుపరిచితుడు.. స్థానికంగా అనేక వ్యాపారాలు చేస్తున్న ఆయనకు వందకు పైగా విద్యా సంస్థలు.. ఓల్డేజ్ హోంలు.. ఆసుపత్రులు ఉన్నాయి. ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. ఆయనకున్న ఆస్తుల విలువ దాదాపు రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ మొత్తం ఆస్తుల్ని అమ్మేసి.. ఆ డబ్బుతో సంక్షేమ పథకాలకు వినియోగించాలని ఆయన యోగి సర్కారును కోరారు.

ఈ నేపథ్యంలో స్పందించిన యోగి సర్కార్ ఆయన ఆస్తులకు సంబంధించిన అంశాల్ని చూసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయటం గమనార్హం. గోయల్ కు భార్య.. ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె ఉన్నారు. తమ ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేస్తానని చెప్పిన వెంటనే.. వారి సంతానం కూడా ఆయన మాటకు మద్దతు ఇవ్వటం అన్నింటికంటే గొప్ప విషయంగా చెప్పాలి.

దాదాపు యాభై ఏళ్ల పాటు తాను కష్టపడి సంపాదించిన మొత్తాన్ని పేదల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వటం అంటే.. అంతకు మించిన మంచి మనసు ఉన్న వ్యక్తి చాలా చాలా అరుదుగా ఉంటారని చెప్పక తప్పదు. లాక్ డౌన్ సమయంలో యాభైకు పైగా గ్రామాల్ని దత్తత తీసుకొని అక్కడి ప్రజలందరికి ఆహారం.. మందులు పంపిణీ చేశారు. అరవింద్ గోయల్ తండ్రి.. తల్లి ఇద్దరూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవాళ్లే.

సమాజం కోసం గోయల్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా త్వరలో పదవీ విరమణ చేయనున్న రామ్ నాథ్ కోవింద్ తో పాటు నలుగురు రాష్ట్రపతుల నుంచి ఆయన పురస్కారాలు అందుకున్నారు. మన చుట్టూ మంచి మనుషులు ఎంతోమంది ఉన్నారనటానికి అరవింద్ గోయల్ నిలువెత్తు నిదర్శనంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News