చంద్రబాబు కన్నా కేజ్రీవాల్ ముందున్నాడు !​

Update: 2015-07-17 07:04 GMT
    పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అమ్మ క్యాంటీన్లు ఎంతగా సక్సెస్ అయ్యాయో అందరికీ తెలిసిందే... విభజన తరువాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పధకాన్ని మన రాష్ట్రంలోనూ అన్న క్యాంటీన్ల పేరుతో అమలు చేయాలనుకున్నారు. బాధ్యతలను సంబంధిత మంత్రి పరిటాల సునీతకు అప్పగించారు. తమిళనాడులో  ఈ పథకం ఎలా అమలవుతుందో చూడ్డానికి మంత్రి సునీత, అధికారులు పలుమార్లు వెళ్లారు. ఇంతచేసినా ఫలితం శూన్యం... ఏడాది అవుతోంది కానీ ఇంతవరకు అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.​

మరోవైపు మన పొరుగు రాష్ట్రం ఒడిశా కూడా ఇలాంటి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావించింది. దీనికి సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి తన ఆలోచనను ప్రజలకు తెలియచెప్పిన రెండు నెలల్లోనే అమలు చేసేశారు. ఒడిశాలో బ​స్టాండ్లు, హాస్పిటళ్లు, ప్రభుత్వాసుపత్రులు, రైల్వే స్టేషన్ లు , ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఇప్పుడు ఈ 'ఆహార్' క్యాంటీన్లు ప్రజాదరణ పొందాయి.

    ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ప్రజాదరణ పొందుతున్న తక్కువ ధర భోజనం క్యాంటీన్లను ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడంలేదు. మనం మీనమేషాలు లెక్కిస్తుంటే మిగతా రాష్ట్రాలన్నీ ఈ విషయంలో ముందుకెళ్తున్నాయి. తాజాగా ఢిల్లీలో అక్కడి సీఎం కేజ్రీవాల్ కూడా వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించేశారు. ఢిల్లీలో పేదలకు తక్కువ ధరకే భోజనం అందించేందుకు వీలుగా ఆసుపత్రులు, పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో ఈ క్యాంటీన్లను ఏర్పాటుచేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు.

    దినసరి కూలీలు, రిక్షావాళ్లు, సరైన ఉపాధి లేనివారు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర చిన్నాచితకా శ్రమజీవులంతా రూ.5 నుంచి రూ.10 మధ్యలో ధరకే భోజనం తినే ఏర్పాట్లు చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు.

    కాగా వీరందరికంటే ముందే ఈ పథకాన్ని, దాని ప్రయోజనాలను గుర్తించిన చంద్రబాబు అమలు విషయంలో మాత్రం బాగా వెనుకబడిపోయారు. రాజధాని లేని రాష్ట్రాన్ని నానా ఇబ్బందులు పడుతూ నడిపిస్తున్న ఆయనకు రాజకీయంగా ఇటీవల వరుస దెబ్బలు తగులుతున్నాయి. వాటి ప్రభావం ప్రజాదరణపై పడకుండా ఉండాలంటే తక్షణం ప్రజలకు అత్యంత ప్రయోజనం కల్పించే ఇలాంటి పథకాలను అమలు చేయడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News