నువ్వు 2 చోట్లా ఓడిపోతావ్.. నువ్వు నాశనానికే వచ్చావ్

Update: 2022-02-13 23:30 GMT
వచ్చ వారం ఇదే రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్ ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీని మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నెల క్రితమే భగవత్ మాన్ ను ఎంపిక చేసింది. దీనిపై టెలిఫోన్ సర్వే కూడా చేసింది. 90 శాతం మంది పంజాబీలు తమ సీఎం అభ్యర్థిగా మాన్ ను ఎంచుకున్నరాని ప్రకటించింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ కు 5 శాతం మొగ్గు కూడా లేదని తెలిపింది. దీనిపై సిద్ధూ తీవ్రంగా మండిపడిపడ్డాడు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.

ఇక పంజాబ్ లో బీజేపీ.. శిరోమణి అకాళీ దళ్ (సంయుక్త), తాజా మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ తో కలిసి బరిలో దిగింది. ఈ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. కాగా, రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి. రెండు పార్టీల నేతలు అంతే దీటుగా పోటీ పడుతున్నారు కూడా. ఆదివారం పంజాబ్ సీఎం చన్నీ ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ ను నాశనం చేసేందుకేవచ్చారంటూ మండిపడ్డారు. దీనిపై కేజ్రీ అంతే దీటుగా స్పందించారు. చన్నీ.. పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ ఓడిపోతారని వ్యాఖ్యానించారు. అంతేగాక ఇసుక మైనింగ్‌లో సీఎం ప్రమేయంపై మండిపడ్డారు. ఇదే అంశంపై చన్నీపై ప్రతిపక్షాలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి.

అక్కడి అధికార కాంగ్రెస్‌కు ప్రధాన పోటీగా తయారైన ఆమ్‌ఆద్మీ పార్టీ చన్నీ ప్రభుత్వానికి సవాల్‌ విసురుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ సీఎం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది. తాజాగా పంజాబ్‌ సీఎం రెండు చోట్లా ఓడిపోతారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ పేర్కొన్నారు. తాము మూడోసారి నిర్వహించిన టెలిఫోనిక్‌ సర్వేలో ఇదే విషయం తేలిందని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా అమృత్‌సర్‌లో పర్యటించిన కేజ్రీవాల్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

'ముఖ్యమంత్రి చన్నీ సాహెబ్‌ ఈసారి ఎన్నికల్లో చామ్‌కౌర్‌, భదౌర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మేం మూడుసార్లు జరిపిన సర్వేలో సీఎం చన్నీ రెండుచోట్లా ఓడిపోనున్నట్లు తేలింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఇక ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారు..?' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇక సీఎం పోటీ చేస్తున్న చామ్‌కౌర్‌ నియోజకవర్గంలో ఆమ్‌ఆద్మీ పార్టీ 52శాతం ఓట్లు పొందనుందని.. భదౌర్‌లో తమ పార్టీకి 48శాతం ఓట్లు లభిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.

ఇక పంజాబ్‌ సీఎం చన్నీపై వస్తోన్న ఇసుక మైనింగ్‌ ఆరోపణలపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఇప్పటికే చన్నీ బంధువు వద్ద దొరికిన డబ్బంతా సీఎందేనని నిందితుడు అంగీకరించినప్పటికీ ఈడీ ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ మైనింగ్‌ విషయంలో పంజాబ్‌ సీఎంపై వస్తోన్న ఆరోపణలను ఆయన స్వయంగా దర్యాప్తు జరపలేరని.. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని అన్నారు.

చన్నీ ఏమన్నారంటే..
కేజ్రీవాల్‌ తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేసేందుకు యత్నించారని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ మండిపడ్డారు. పంజాబ్‌ను దోచుకునేందుకే ఆయన ఇక్కడికి వచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గం చామ్‌కౌర్‌ సాహిబ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆప్‌ నేతలు ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణకు ఆదేశించారు. అయితే.. దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని స్థానిక డిప్యూటీ కమిషనర్ తాజాగా ప్రాథమిక నివేదిక ఇచ్చారు. కానీ, విచారణ కొనసాగుతుందని చెప్పారు.

తదనంతరం చన్నీ మాట్లాడుతూ.. 'కేజ్రీవాల్‌..  అబద్దాలకోరు. పలు తప్పుడు ఆరోపణలతో నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు యత్నించారు. కానీ.. ఏదీ నిజం కాదు. ఆప్‌ నేతలు నాపై గవర్నర్‌కూ ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణకు ఆదేశించారు. చివరకు సత్యమే గెలిచింది' అని వ్యాఖ్యానించారు. 'బ్రిటీష్ వారు భారత్‌ను కొల్లగొట్టేందుకు వచ్చారు. అదే విధంగా, కేజ్రీవాల్, అతని దిల్లీ కుటుంబ సభ్యులు, ఇతర బయటి వ్యక్తులు పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చారు. అయితే.. మొఘలులు, బ్రిటీషర్ల విషయంలో స్పందించినట్లుగానే పంజాబ్‌ వారిని కూడా సరైన చోటుకే చేర్చుతుంది' అని చన్నీ అన్నారు.

రాష్ట్రంలో ఈ నెల 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ.. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఈడీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని చరణ్‌జిత్‌ ఆరోపించారు.
Tags:    

Similar News