ఢిల్లీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2018-02-26 06:34 GMT
అధికారం చేతికి వ‌చ్చే వ‌ర‌కూ అంద‌రూ ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడేవారే.  దాని ప‌రిర‌క్ష‌ణ కోసం ఎంత ఓపెన్ గా ఉండాలో.. మ‌రెంత మీడియా ఫ్రెండ్లీగా ఉండాలో స్పీచుల‌తో దంచి కొడ‌తారు. అలాంటోళ్ల చేతికి ప‌వ‌ర్ వ‌చ్చినంత‌నే మొత్తంగా మారిపోతారు. అన్ని బిగించేస్తారు. అదేమంటే.. దానికి స‌మాధానం చెప్ప‌టం కూడా ఉండ‌దు.

ఇలాంటి వేళ‌లో.. ప్ర‌భుత్వం నిర్వ‌హించే అత్యున్న‌త స‌మావేశాల్ని ఇక‌పై ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామంటూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌. ఉద్య‌మ పంథాను వీడి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావ‌ట‌మే కాదు.. మోడీ హ‌వాకు చెక్ పెట్టి.. తానేంటో ఫ్రూవ్ చేసుకున్న సామాన్యుడు కేజ్రీవాల్‌. ఢిల్లీలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు.

మిగిలిన రాష్ట్రాల మాదిరి ఢిల్లీ రాష్ట్రంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి సినిమా ఉండ‌దు. అంతా కేంద్రం చెప్పు చేతుల్లో ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్రాన్ని వ్య‌తిరేకించే ప్ర‌భుత్వం మ‌న‌గ‌ల‌గ‌టం చాలా క‌ష్టం. అందునా మోడీ లాంటి నేత ప్ర‌ధానమంత్రి కుర్చీలో కూర్చుంటే ఉండే తిప్ప‌లు అన్ని ఇన్ని కావు.

ఇలాంటి ఈతి బాధ‌లెన్నో ప‌డ్డ కేజ్రీవాల్ కు తాజాగా ఎదురైన అనుభ‌వం భారీ షాక్ ను ఇచ్చింది. ఢిల్లీ చీఫ్ సెక్ర‌ట‌రీ అన్షు ప్ర‌కాష్ పై త‌మ పార్టీ ఎమ్మెల్యేలు త‌న నివాసంలో దాడి చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. అంతేనా.. పోలీసుల త‌నిఖీలు త‌ప్ప‌లేదు. ఇలాంటి వేళ‌.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇక‌పై ప్ర‌భుత్వం నిర్వ‌హించే అత్యున్న‌త స్థాయి స‌మావేశాల్ని లైవ్ లో టెలికాస్ట్ చేస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

త‌మ ప్ర‌భుత్వంపై కొంద‌రు అధికారులు ప‌ని క‌ట్టుకొని స‌మ‌స్య‌లు సృష్టించే య‌త్నానికి చెక్ పెట్టేందుకు వీలుగా లైవ్ టెలికాస్ట్ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన అధికారిక వెబ్ సైట్లో ఇక‌పై సాగే స‌మావేశాల‌న్నీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు.. ఇక‌పై ప్ర‌భుత్వానికి చెందిన ఫైళ్ల‌ను కూడా ఆన్ లైన్లో పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రేం కోరుకుంటే ఆ స‌మాచారం అంద‌రికి అందుబాటులో ఉంచేలా చేయ‌టం ద్వారా త‌మ ప్ర‌భుత్వం ఎంత క్లీన్ గా వ‌ర్క్ చేస్తుంద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణ‌యం సాహ‌సోపేత‌మైందిగా అభివ‌ర్ణిస్తున్నారు. ప్ర‌తిది ర‌హ‌స్యంగా సాగిపోవాల‌ని భావిస్తున్న వేళ‌.. అంతా ఓపెన్ అన‌ట‌మే కాదు.. లైవ్ కు రెఢీ అన‌టం చూస్తే కేజ్రీవాల్ ఉండాల్సిన సీఎంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News