మోడీ అడుగుజాడల్లో నడుస్తున్న కేజ్రీ

Update: 2016-01-19 13:43 GMT
అచ్చే దిన్ అంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊరించిన నరేంద్రమోడీ సర్కారు మీద దేశ ప్రజలు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఆయన కానీ అధికారంలోకి రావటమే ఆలస్యం.. విదేశాల్లో దాగిన నల్లధనం దేశానికి బట్వాడా అయిపోవటం.. వాటిని దేశ ప్రజలకు పంచేయటం మొదలు పెడితే.. చాలానే జరుగుతాయన్న ఆశల లోకంలోకి విహరించారు. ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చకున్నా ఫర్లేదు.. కనీసం వాతలు పెట్టకుండా ఉంటారని అనుకున్నారు. అందుకు భిన్నంగా అవకాశం చిక్కిన ప్రతిచోట బాదుడే బాదుడుతో గూబ గుయ్యిమనేలా చేస్తోంది మోడీ సర్కార్.

దాదాపు 110 డాలర్లు ఉండే క్రూడాయిల్ బ్యారెల్ ధర కాస్తా 28 డాలర్లకు పడిపోయినప్పటికీ పెట్రోల్.. డీజిల్ లీటరు ధరలో మాత్రం పెద్దగా మార్చింది లేదు. ధరలు తగ్గించటం తర్వాత.. సుంకాలు పెంచేస్తున్న పరిస్థితి. ఇదొక్కటే కాదు.. రైలు ఛార్జీలు మొదలు అవకాశం దొరికిన ప్రతి విషయంలోనూ బాదేస్తున్న మోడీ సర్కారు బాటలోనే పయనిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.

ఢిల్లీ రాష్ట్ర ఖజానాను నింపుకోవాలని భావిస్తున్న కేజ్రీసర్కారు.. తాజాగా పెట్రోల్ .. డీజిల్ మీదున్న అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పెట్రోల్ మీదున్న 25 శాతం అమ్మకం పన్నును 27 శాతానికి.. డీజిల్ మీదున్న 16.6శాతం పన్నును 18 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్డర్ వేసేశారు. మోడీని నిత్యం తప్పు పట్టే కేజ్రీవాల్ సైతం.. పాలన దగ్గరకు వచ్చేసరికి మాత్రం మోడీని ఫాలో అయిపోవటం ఏమిటో..?
Tags:    

Similar News