సరి-బేసికి కేజ్రీవాల్ ఫైన్ రెండు వేలు !

Update: 2015-12-22 07:42 GMT
ఇటీవ‌ల మ‌నం చైనాలో స్వ‌చ్ఛ‌మైన గాలిని క్యాన్ల‌లో కొనుక్కోవ‌డం చూశాం...ప్ర‌పంచంలోనే జ‌నాభా ప‌రంగా పెద్ద దేశ‌మైన చైనాలో ప్ర‌జ‌ల‌కు పీల్చుకునేందుకు మంచి గాలి కూడా క‌రువైపోయింది. దీంతో వాళ్లు విదేశాల నుంచి స్వ‌చ్ఛ‌మైన గాలి క్యాన్ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నారు. ఇప్పుడు మ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో కూడా ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి క‌రువైపోయింది. ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ ఎక్కువైపోతోంది. పీల్చే గాలి పూర్తిగా క‌లుషితం అయిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం డీజిల్ వాహ‌నాలే అని స‌ర్కారు గుర్తించింది. అందుకే వీటికి క‌ళ్లెం వేసేందుకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించింది. ఇందులో భాగంగానే స‌రి-బేసి విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ప్ర‌యాణికుల‌కు, ఉద్యోగుల‌కు `స‌రి-బేసి` విధానం వ‌ల్ల ఎటువంటి ఇబ్బందులూ క‌ల‌గ‌కుండా ఉండేందుకు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.  ఈ `స‌రి-బేసి`ని అందరూ క‌చ్చితంగా పాటించే తీరాల‌ని కేజ్రీ స‌ర్కారు హుకూం జారీ చేసింది. ఇక ఇప్పుడు ఎవ‌రైనా వీటిని అతిక్ర‌మిస్తే..  వారికి జ‌రిమానా విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇందుకు సంబంధించి విధివిధానాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీని ప్ర‌కారం ఎవ‌రైనా ఈ స‌రి-బేసి విధానాన్ని అతిక్ర‌మిస్తే.. రెండు వేల రూపాయ‌ల జ‌రిమానా క‌ట్టాల్సిందే. ఇది జ‌న‌వ‌రి 1నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని తెలిపింది. అయితే ఇందుకు కొన్ని మిన‌హాయింపులు కూడా ఇవ్వాల‌నే యోచ‌న‌లో ఉంది. న‌లుగురు ప్ర‌యాణికులు క‌లిగిన కార్లు, మ‌హిళా డ్రైవ‌ర్లు, మ‌హిళా ప్రయాణికులు గ‌ల కార్ల‌కు వీటి నుంచి మిన‌హాయింపు నివ్వాల‌ని ఆలోచిస్తోంది. అయితే తాము ప్ర‌వేశ‌పెట్టిన ఈ విధానానికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ కేంద్రానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. అన్ని విభాగాల ఉద్యోగులు ఈ విధానాన్ని పాటించాల‌ని కోరారు. ఈ `స‌రి-బేసి` సిస్ట‌మ్ ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎంత వ‌ర‌కు కంట్రోల్ చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News