హైదరాబాద్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

Update: 2016-01-21 04:37 GMT
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం మరింత పెద్దది అవుతోంది. రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని.. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని.. మరికొన్ని డిమాండ్లతో చేస్తున్న నిరసన మరింత ఉధృతంగా మారింది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఈ అంశంపై మాట్లాడటం.. వర్సిటీకి వచ్చి పరామర్శలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రానున్నారు. ఇప్పటివరకూ పలువురు రాజకీయ నాయకులు వచ్చినా.. ముఖ్యమంత్రి స్థాయి నేత రావటంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. రోహిత్ ఆత్మహత్యపై సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటం.. వివిధ పార్టీలకు చెందిన నేతలు వర్సిటీని సందర్శించి.. నిరసన చేస్తున్న విద్యార్థులతో భేటీ అయ్యాయి.

బుధవారం ఒక్కరోజులో నిరసన చేస్తున్న విద్యార్థుల్ని పరామర్శించిన రాజకీయప్రముఖుల్లో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు.. తెలుగుదేశం పార్టీ బృందం.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులు.. మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ తదితరులు ఉన్నారు.

ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రమే కాదు.. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. సురవరం సుధాకర్ రెడ్డిలు రానుండటంతో ఈ వివాదం రాజకీయంగా మరింత ముదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏమైనా రోహత్ ఆత్మహత్య ఇప్పుడు జాతీయ అంశంగా మారింది.
Tags:    

Similar News