అమెరికా వణుకుతోంది..

Update: 2019-02-01 06:20 GMT
దశాబ్ధంలోనే అతి భీకరమైన చలి అమెరికాను వణికిస్తోంది. అమెరికాలో మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆర్కిటికా నుంచి వీస్తున్న భయంకరమైన శీతల గాలుల ధాటికి జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు. అమెరికా పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అంటార్కిటికా ధృవం కంటే తక్కువగా మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బయటకొస్తే మనిషి ప్రాణాలకే ముప్పు కావడంతో స్కూళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూసివేశారు.

అమెరికాలో శీతల గాలులకు ఇప్పటివరకూ 8మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అమెరికా ఉత్తర పశ్చిమలోని దాదాపు 12 రాష్ట్రాల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్, ఒహియో, అయోవా, డకోటాస్, నెబ్రస్మా ప్రాంతాల్లో తపాలా, రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది.

అమెరికాలో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మైనస్ లకు పడిపోతున్నాయి. షికాగోలో బుధవారం ఉదయం మైనస్ -30.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇల్లినాయిస్ లో -31 డిగ్రీలు నమోదైంది. చలి తీవ్రతకు ప్రసిద్ధ నయాగారా జలపాతం గడ్డకట్టిపోయింది.నది ప్రవాహం నిలిచిపోయి మంచుముద్దగా మారింది.  పిల్లలు, వృద్ధుల కోసం పలుచోట్ల 200 వార్మింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. బస్సులను సైతం మొబైల్  వార్మింగ్ కేంద్రాలుగా మార్చేశారు. షికాగోలో వీధుల్లో నివసించే 16వేల మందిని శిబిరాలకు తరలించారు.

ఇక అమెరికాలో మరోసారి విధ్వేష దాడి జరిగింది. అమెరికా కెంటకీ రాష్ట్రంలోని ప్రఖ్యాత హిందూ దేవాలయమైన స్వామి నారాయణ ఆలయంపై దుండగులు దాడి చేశారు. విగ్రహంపై నల్లరంగు పూశారు. ఆలయ గోడలపై విద్వేష పూరిత రాతలు రాశారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News