అతడు జైల్లో ఉన్నంతవరకు సీబీఐ టీం క్షేమంగా ఉంటుందట

Update: 2022-05-12 08:43 GMT
దేశంలో అత్యుత్తమ దర్యాప్తు సంస్థ అన్నంతనే సీబీఐ పేరును పలువురు గుర్తు తెచ్చుకుంటారు. ఏదైనా దారుణ నేరం చోటు చేసుకున్నంతనే మిగిలిన దర్యాప్తు సంస్థల్ని వదిలేసి.. సీబీఐ విచారణ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించటం తెలిసిందే. అంతటి క్రెడిట్ ఉన్న సంస్థకు చెందిన అధికారులు ఏదైనా కేసు విచారణలోకి దిగితే..నేరస్తులకు చెమటలు పడుతుంటాయి. అందుకు భిన్నంగా.. తాజాగా రివర్సు సీన్ నడుస్తోంది ఏపీలోని కడప జిల్లాలో.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో దివంగత మహానేత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకాను ఆయన ఇంట్లోనే దారుణం హత్య  చేసిన సంగతి తెలిసిందే. తొలుత సాధారణంగా మరణంగా.. ఆ తర్వాత అత్యంత పాశవికంగా హతమార్చిన వైనం బయటకు వచ్చి షాక్ కు గురి చేసింది.

ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. ఈ కేసు విచారణ కోసం సీబీఐ రంగంలోకి దిగటం తెలిసిందే. విచారణలో భాగంగా కడప జిల్లాకు సీబీఐ టీం ఒకటి వచ్చింది. తాజాగా ఒక ఎస్ఐతో పాటు.. మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే కడపలో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సీబీఐకు చెందిన సిబ్బందికి వార్నింగ్ ఇచ్చిన వైనం షాకింగ్ గా మారింది. మరీ.. ఇంత బరితెగింపా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి.. వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నంతవరకే సీబీఐ టీం సురక్షితంగా ఉంటుందని.. అతను బెయిల్ మీద బయటకు రాగానే సీబీఐ టీంను చంపేస్తాడని బెదిరించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సీబీఐ టీం వెంటనే విజయవాడ వెళ్లిపోవాలని.. లేకుంటే బాంబు వేసి పేల్చేస్తానని వారికి చెప్పినట్లుగా కంప్లైంట్ లో పేర్కొన్నారు. సీబీఐ ఎస్ఐ అంకిత్ యాదవ్ ఆదేశాల మేరకు సీబీఐ డ్రైవర్ ఒకరు భోజనం తేవటానికి పంజాబీ డాబాకు వెళ్లాడు. ఆ సందర్భంగా పాత బైపాస్ రోడ్డులోని పద్మావతి వీధిలో వాహనానికి అడ్డంగా వచ్చిన ఒక ముసుగు కప్పుకున్న వ్యక్తి వచ్చి.. తనకు వార్నింగ్ ఇచచాడన్నారు.

అంతేకాదు.. ఈ నెల ఆరున విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని సీబీఐ క్యాంపు కార్యాలయం నుంచి స్పెషల్ పీపీ చెన్నకేశవులను కారులో ఎక్కించుకొని అమరావతి హైకోర్టుకు తీసుకెళ్లావన్న విషయాన్ని కూడా ప్రస్తావించి.. తాము ఫాలో అవుతున్నట్లు చెప్పారన్నారు. ఈ తీరులో సీబీఐకే థోకా ఇచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. దీనిపై సీబీఐ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News