రోటీన్ కు భిన్నంగా అసద్ వ్యాఖ్యలు.. అఫ్గాన్ ఎపిసోడ్ పై ఆయన మాటలు వినాల్సిందే

Update: 2021-08-17 15:30 GMT
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు.. ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. నోరు విప్పితే మైనార్టీ ప్రయోజనాల పేరుతో వ్యాఖ్యలు చేయటం.. జాతీయ ప్రయోజనాల కంటే మత ప్రయోజనాల మీదనే ఆయన ఫోకస్ ఉంటుందన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆఫ్టాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మొనగాడు లాంటి మోడీ మాష్టారి నోటి నుంచి చప్పుడు లేని పరిస్థితి. దేశ సరిహద్దులకు కాస్తంత దూరంలో ఉన్న అఫ్గాన్ లో చోటు చేసుకునే మార్పులు.. మన మీదా ఉంటాయన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే.. అఫ్గాన్ పునర్నిర్మానానికి మోడీ మాష్టారు తక్కువేం ఖర్చు చేయలేదు. దాదాపుగా 3 బిలియన్ డార్లు ఆయన ఖర్చు చేశారు.

అంత ఖర్చు చేసి.. ఈ రోజు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోటాన్నిమోడీ మాష్టారు మౌనంగా ఎందుకు ఉన్నట్లు? అంతర్జాతీయ వేదికల మీద తన ఇమేజ్ ను పెంచుకునేందుకు తెగ తాపత్రయపడే ఆయన.. ఆఫ్గాన్ పరిణామాల మీద కానీ.. తాలిబన్ల మీదా ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయకుండా కామ్ గా ఉండిపోయారు.

ఇలాంటివేళ..ప్రధాని మోడీ మౌనాన్ని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. తాజాగా మజ్లిస్ అధినేత కమ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆఫ్గాన్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాల్నిప్రస్తావించటమే కాదు.. మోడీ సర్కారు తీరును వేలెత్తి చూపించారు. తాలిబన్లను భారత్ గుర్తించినా గుర్తించకున్నా వారితో చర్చలకు లాంఛనంగా మార్గాల్ని తెరిచి ఉండాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్లు.. మీడియాతో మాట్లాడిన మాటల్ని గుది గుచ్చి చూసిప్పుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మాటల్లో ఉన్నాయని చెప్పాలి.

దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాల్నితెరిచి ఉంచాలని తాను 2013లోనే సలహా ఇచ్చానని.. తన మాటను ఎవరూ ఖాతరు చేయలేదన్నారు. మాస్కోలో పాక్.. అమెరికాలు తాలిబన్లతో చర్చలు జరుపుతుంటే.. ట్రంప్ ను తాలిబన్ల నేత ఎన్నిసార్లు హగ్ చేసుకున్నారో భారత పీఎంవో లెక్కలు వేస్తూ ఉందన్నారు.  అఫ్గానిస్థాన్ పై ప్రభుత్వ విధానం ఏమిటో ఇప్పటికి తెలీదన్న అసద్.. 'ఆ దేశంలో భారత్ 3 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? సంక్షోభం తలుపు తట్టినప్పుడు మోడీ సర్కారు నాటకీయతను మొదలు పెడుతుందన్నారు. తాలిబన్లతో చర్చలు జరపాలని అంతర్జాతీయ భద్రతా నిపుణులంతా కూడా చెబుతున్నారు'' అని వ్యాఖ్యానించారు.

మరోవైపు సంఘ్ పెద్దాయన మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని ఓవైసీ కొట్టిపారేశారు. చైనాపై ఎక్కువగా ఆధారపడుతూ పోతే దాని ముందుతల వంచాల్సి వస్తుందంటూ చేస్తున్న వ్యాఖ్యలన్ని బోగస్ అని కొట్టిపారేశారు. భారత భూభాగాలపై చైనా తిష్ట వేసినప్పుడు ఆయనేం మాట్లాడారు?అని సూటిగా ప్రశ్నించారు. తాజాగా అసద్ ప్రస్తావించిన అంశాలు రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. మోడీ సర్కారు తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పారని చెప్పాలి.

అఫ్గాన్ వ్యవహారంలో  మోడీ సర్కారు తీరును తప్పు పడుతూ అసద్ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను తరచూ వ్యతిరేకించే వర్గాలు సైతం ఆలోచించేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. తాలిబన్లు.. అఫ్గాన్ మహిళల్ని జాగ్రత్తగా తీసుకోవాలని.. మానవత్వంతో వ్యవహరించి.. ఆధునిక ప్రపంచం ఆందోళనల్ని తగ్గించేలా వ్యవహరించమని కాస్త పెద్ద మనిషిగా ఒక మాట ట్వీట్ చేస్తే ఏమవుతుంది? అసద్ ఆ మాత్రం ధైర్యం చేయలేరా?
Tags:    

Similar News