భారత్ నాది.. మోడీది కాదు.. అసద్ కొత్త వాదన విన్నారా?

Update: 2022-05-29 13:30 GMT
అందుకే అంటారు కాలం మహా సిత్రమైదని. అందులోకి రాజకీయ నేతల మాటలపై కాలం చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఎప్పుడూ వినని రీతిలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారతదేశం ఎవరిదో ఆయనకు ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లుంది. ఇప్పటివరకు ఆయన నోటి నుంచి ఎప్పుడూ రాని రీతిలో ఆయన మాటలు వచ్చాయి. భారత్.. నాది.. మోడీషాలదీ కాదు.. అంతకు మించి థాక్రేలది అసలే కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం ద్రవిడియన్లు.. ఆదివాసీలదిగా అభివర్ణించారు. ఆఫ్రికా.. మధ్య ఆసియా.. ఇరాన్.. తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందన్న ఆయన.. "దేశంలోకి మొగలలు వచ్చాకే ఆర్ఎస్ఎస్.. బీజేపీలు వచ్చాయి" అంటూ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని భివాండీలో జరిగిన బహిరంగ సభలో అసద్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్.. బీజేపీలు నిత్యం మొఘలుల గురించి చెబుతున్నాయని.. కానీ భారత్ ఆఫ్రియా.. మధ్య.. తూర్పు ఆసియా దేశాల నుంచి వచ్చిన వారితో ఏర్పడిందన్నారు.

జ్ఞాన్‌వాపి మసీదు, తాజ్‌మహల్, కుతుబ్‌మినార్‌లపై జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ.. "బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కలిసి ముస్లింల చిహ్నాలను చెరిపివేయాలని అనుకుంటున్నాయి" అంటూ మండిపడ్డారు. టోపీ.. మసీదు దేశానికి ప్రమాదమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం.. ద్రవ్యోల్బణం గురించి ఎవరూ మాట్లాడటం లేదని.. ఈ సమస్యలకు కూడా మొఘలులే కారణమా? అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

"ఔరంగజేబు భారతదేశంలో నిరుద్యోగాన్ని పెంచారా? ఈ రోజు ముస్లింలకు బీజేపీ భయపడుతోంది. బీజేపీ - సంఘ్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి.

ఇదే తీరు కొనసాగితే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోతుంది" అని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా శివసేన.. ఎన్సీపీలపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమైనా.. ఓవైసీకి హటాత్తుగా చరిత్ర గుర్తుకు రావటమే కాదు.. దేశ మూలాల్లోకి వెళ్లిపోతున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
Tags:    

Similar News