అసద్ ఫోన్ చేస్తే కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకున్నారా?

Update: 2019-12-28 05:09 GMT
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంత పవర్ ఫుల్ అన్నది ఆయన ఫోన్ కాల్ చెప్పేస్తుంది. ఆయన ఫోన్ చేయాలే కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిగిలిన కార్యక్రమాల్ని రద్దు చేసుకుంటారు. మిత్రుడికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే కేసీఆర్.. అసద్ కు ఎలాంటి అసౌకర్యం ఎదురు కాకూడదన్నట్లుగా వ్యవహరిస్తారు. మొన్నటికి మొన్న తాను కలుస్తున్నట్లుగా కేసీఆర్ కు సమాచారం ఇచ్చినంతనే.. ఆయనకు అపాయింట్ మెంట్ దొరకటమే కాదు.. ఆయనతో పాటు వచ్చిన ముస్లిం నేతలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గడిపిన సమయాన్ని మర్చిపోకూడదు.

తాజాగా నిర్వహించిన నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు అసద్. కేసీఆర్ లౌకికవాది అని.. అందుకే ఆయనతో కలిసి ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్.. ఓవైసీ బతికి ఉన్నంత కాలం మజ్లిస్.. టీఆర్ఎస్ లు కలిసే ఉంటాయన్న భారీ వ్యాఖ్యను చేసేశారు. సీఏఏ.. ఎన్నార్సీ.. ఎన్ పీఆర్ లను రాష్ట్రంలో అమలు చేయమని కేసీఆర్ తమతో చెప్పినట్లుగా అసద్ వెల్లడించారు.

నిజామాబాద్ సభకు టీఆర్ ఎస్.. న్యూడెమోక్రసీ.. ఇతర సంఘాల నేతలతో కలిసి ఓవైసీ పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొనేందుకు తాను స్వయంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేశానని ఓవైసీ వెల్లడించారు. అయితే.. వారి కుండే కారణాలతో కాంగ్రెస్ నేతలు సభకు రాలేదన్నారు. అసద్ లాంటి పవర్ ఫుల్ అధినేత ఫోన్ చేసి పిలిస్తే కాంగ్రెస్ నేతలు రాకపోవటమా? అని కొందరు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.ఒకవేళ సభకు వచ్చినా.. తమకు ఎలాంటి ప్రాధాన్యత లభించదు సరికదా మైలేజీ మొత్తం మజ్లిస్ అధినేతకు సొంతమవుతుందన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News